సంస్కరణలు రావాలి ఎన్నికలు మారాలి

సంస్కరణలు రావాలి ఎన్నికలు మారాలి

పాలనలో అనుభవం ఉండి మచ్చలేని వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమించేందుకు సుప్రీం కోర్టు సూచించిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదన స్వాగతించాలి. కానీ, ఇంతటితో సరిపోదు. పోలీసు శాఖలో సంస్కరణలు కూడా కావాలి. ప్రజల్లో ఓటు అమ్ముకునే సంస్కృతి పోవాలి. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా సవరణలు జరిగి, నేరచరితులు ఎన్నికల్లో పాల్గొనకుండా చట్టం వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. 

ఈ మధ్య సుప్రీం కోర్టు ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై కొన్ని విమర్శలున్నా మొత్తానికి ఎన్నికల ముఖ్య కమిషనర్, కమిషనర్ల నియామకం రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరిగేందుకు మార్గం ఏర్పడింది. దేశంలో ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన అధికారాలు రాజ్యాంగంలోని ఆర్టికల్324 కల్పిస్తున్నది. అయితే ఎన్నికల ముఖ్య కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి పార్లమెంట్ ఒక చట్టం తీసుకురావాలని అనుకరణ 324(2) నిర్దేశిస్తున్నది. కానీ రాజ్యాంగం అమలుల్లోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకు ఏ కేంద్ర ప్రభుత్వమైనా, ఎలాంటి చట్టం చేయక తమకు నచ్చిన వారిని, తమకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకుంది. ఒక్క శేషన్ తప్ప ఇంతవరకు నియమితులైన ముఖ్య, ఇతర కమిషనర్లు ఎవరూ కూడ తమ విధులకు న్యాయం చేయలేదన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఒక చట్టం తెచ్చే వరకు -ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంట్​లో విపక్షనేతతో కూడిన త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకు ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలని చెప్పడంతో ప్రభుత్వ జోక్యం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఎన్నికల కమిషనర్ల నియామకంలో సవరణలతో దేశంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని, సచ్ఛీలురు ఎన్నికై అవినీతి రహిత చట్ట బద్ధ పాలన, చట్టాల ముందు అందరూ సమానులే అన్న సూత్రాలు అమలవుతాయని అనుకోవడానికి వీలు లేదు.

ప్రలోభాలు ఆగేనా?

గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో డబ్బు, కులం, ప్రాంతీయతత్వం వంటి వాటిని ఉపయోగించుకొని నేరస్థులు రాజకీయాల్లోకి చొరబడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో కానీ, పార్లమెంటులో కానీ సగం వరకు సభ్యులు నేర చరిత్ర కలవారే ఉన్నారు. ఇకపోతే దక్షణాది రాష్ట్రాల్లో డబ్బుతో ఓట్లు కొనే దుస్సంప్రదాయం మొదలైంది. తెలంగాణలో ఒక శాసనసభ నియోజకవర్గానికి పది నుంచి ఇరువది కోట్లు ఖర్చు చేయందే గెలుపు సంగతి దేవుడెరుగు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలు ముఖ్యంగా ఓటర్లను డబ్బు, మద్యం, భోజనం ఇతర బహుమతులతో ప్రలోభ పెట్టినా నేరం కిందకే వస్తుంది. భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్171 ప్రకారం ఓటరును ప్రలోభపెట్టడం లంచం కిందకు వస్తుంది. అలాగే ఓటరును కులం, మతం, ప్రాంతం తదితరాలతో ఓట్లు అడగడం కూడా నేరమే. అందుకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం1950 -సెక్షన్ 123 ప్రకారం కూడా ఓటరును ప్రలోభపెట్టిన అభ్యర్థులు శిక్షార్హులు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, ఎన్నికల అధికారులు అడపా దడపా కేసులు రాసినా వాటిపై ఎన్నికల తర్వాత ఎలాంటి చర్యలు ఉండవు. సంవత్సరాల కొద్దీ కోర్టుల్లో కేసులు పెండింగులో ఉంటాయి. ఐదు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు శాసన, పార్లమెంటు సభ్యులపై నమోదైన కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులు స్థాపించాలని త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సుమారు వివిధ జిల్లాల్లో ఉన్న 395 కేసులు ప్రత్యేక కోర్టుకు బదలాయించబడ్డాయి. కేవలం14 కేసుల్లో మాత్రమే నామమాత్రపు శిక్ష పడి మిగిలిన381 కేసులు పోలీసు శాఖ వారు సరైన ఆధారాలు ప్రవేశపెట్టకపోవడంతో కొట్టి వేయబడ్డాయి.

ప్రజల్లో మార్పు రావాలి

ప్రజాప్రాతినిధ్య చట్టంలో చాలా లొసుగులున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోరలున్న చట్టం కావాలి. ఒకసారి కోర్టు ద్వారా శిక్ష పడిన సిట్టింగ్ శాసన, పార్లమెంటు సభ్యుడి పదవి తక్షణమే రద్దు కావాలి. దీనిలో సభాపతి జోక్యం ఉండకూడదు. అలాగే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో 6 సంవత్సరాల వరకు పోటీ చేయకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాల పేరుతో ఎలాంటి స్కీములు ప్రకటించవద్దు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించే పథకాలకు నిధుల సమీకరణ గురించి స్పష్టంగా మ్యానిఫెస్టోలో తెలపాలి. ఇక చివరగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఓటును అమ్ముకునే సంస్కృతి పోవాలి. ప్రజలు ఓటు విలువ గ్రహించి మంచి వారికి ఓటు వేసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో గ్రామాల్లో “నో మనీ -నో ఓట్” అని ప్లకార్డులు పట్టుకొని జనాలు రోడ్ల మీద బైఠాయించిన దృశ్యాలు ప్రజాస్వామ్య వాదులను తలదించుకునేలా చేస్తున్నాయి. పాలనలో అనుభవం ఉండి మచ్చలేని వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమించేందుకు సుప్రీం కోర్టు సూచించిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదన స్వాగతించాలి. కానీ, ఇంతటితో సరిపోదు. పోలీసు శాఖలో సంస్కరణలు కూడా కావాలి. ప్రజల్లో ఓటు అమ్ముకునే సంస్కృతి పోవాలి. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా సవరణలు జరిగి, నేరచరితులు ఎన్నికల్లో పాల్గొనకుండా చట్టం వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కేవలం ఎలక్షన్ కమిషన్​లో ప్రక్షాళన జరిగినంత మాత్రాన పెద్దగా మార్పు ఏమీ రాదు.

పోలీస్ ​సంస్కరణలూ అవసరం

తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు పోలీసు శాఖ మొత్తం రాజకీయ నాయకుల గుప్పెట్లో బందీ అయిపోయింది. స్థానిక శాసనసభ్యుడి అనుమతి లేనిదే ఒక సబ్ ఇన్​స్పెక్టర్​ను ట్రాన్స్​ఫర్ చేయడానికి వీలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు వారు శాసన సభ్యుడు లేక మంత్రిపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను ఎలా తీసుకురాగలడు. అంటే పోలీసు వ్యవస్థ రాజకీయ గుప్పిట్లో నుంచి బయటపడి చట్టబద్ధంగా వ్యవహరించాలి.1861 సంవత్సరంలో బ్రిటీష్ వారు చేసిన పోలీసు చట్టం(కొద్ది మార్పులతో) ఇంకా అమలులో ఉంది. 2006వ సంవత్సరంలో సుప్రీం కోర్టు పోలీసు వ్యవస్థ పని తీరు బాగుపరిచేందుకు కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా రాజకీయ ఒత్తిడుల నుంచి కాపాడడానికి భద్రతా కమిషన్, ఒక పద్ధతి ప్రకారం డీజీపీ, ఎంపిక అలాగే ముఖ్యస్థానాల్లో ఉండి నిజాయితీగా పని చేసేవారికి రెండు సంవత్సరాల వరకు బదిలీలు ఉండకూడదు. పదోన్నతులు, ట్రాన్స్​ఫర్ నియామకాలకు పోలీసు ఎస్టాబ్లిష్​మెంట్ బోర్డు, త్వరితగతిన కేసులు విచారణ కోసం నేరపరిశోధన, శాంతి భద్రతల విభాగాలు వేరు వేరుగా ఉండాలి. ఈ సూచనలను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయడం లేదు. పోలీసుశాఖను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. దీంతో పాలన అస్తవ్యస్తంగా తయారైంది.