ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం :100మంది మృతి, 150 మందికి గాయాలు

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం :100మంది మృతి, 150 మందికి గాయాలు

ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్ లోని -హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్‌లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. 

హమ్దానియాలోని ఈవెంట్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 100మంది సజీవ దహనమయ్యారు. ఎగసిపడిన అగ్ని కీలలకు గాయపడిన 150 మందిని హమ్దానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈవెంట్ హాల్‌లో మంటలు చెలరేగడానికి ఈ వేడుకలో ఉపయోగించిన బాణాసంచా కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఇరాక్ పౌర రక్షణ విభాగం తెలిపింది.

ఎగసిపడిన మంటల్లో ఈవెంట్ హాలు పూర్తిగా కాలిపోయింది. ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. సంఘటన స్థలంలో ఎటు చూసినా సజీవ దహనమైన మృతదేహాలు కనిపించాయి. గాయపడిని వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.

మంటలు భారీగా చెలరేగడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. బాణా సంచా పేల్చడం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. 

మంటలు చెలరేగగానే హాల్ పాక్షికంగా కుప్పకూలిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు. భారీ మంటలకు ధ్వంసమయ్యే నాసిరకం మెటీరియల్ తో ఈ భవనం నిర్మించినట్లు చెప్పారు. పెళ్లి మండపంలో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వల్లే మంటలు భారీగా వ్యాపించినట్లు కొందరు చెబుతున్నారు.