భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన తర్వాత తానూ సూసైడ్ చేసుకున్నాడో భర్త. జనవాడ గ్రామంలో నాగరాజు, సుధా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాగరాజు ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 19వ తేదీ రాత్రి కూడా గొడవ జరగడంతో భార్యను హత్య చేసి, ఆ తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నాగరాజు. 

తమ తండ్రి తమను కూడా చంపేందుకు ప్రయత్నించడంతో తాను..తన తమ్ముడిని తీసుకుని బయటకు పరుగెత్తానని నాగరాజు పెద్ద కుమారుడు దీక్షిత్ చెప్పాడు. తమ తండ్రి నుంచి తప్పించుకోవడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని పోలీసులకు చెప్పాడు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు.