రాష్ట్ర రాజకీయాల్లో మార్పొస్తుంది

రాష్ట్ర రాజకీయాల్లో మార్పొస్తుంది

దుబ్బాకలో బీజేపీ గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా ప్రభావం చూపిస్తుందని అందరూ ఊహించిందే. అనుకున్నట్లే బీజేపీ 4 సీట్ల నుంచి 48 సీట్లకు ఎదిగింది. ఇక టీఆర్ఎస్​ 99 నుంచి 55కు పడిపోవటం వెనక చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ ఈ ఎన్నికలను గతం కంటే సీరియస్ గా తీసుకోవటం, పార్టీ హైకమాండ్​ అంతా ఇక్కడికి వచ్చి విస్తృతంగా ప్రచారం చేయటంతోపాటు కేసీఆర్ పాలన పట్ల పెరిగిన వ్యతిరేకత కూడా కారణమే. కేసీఆర్ నియంతృత్వ ధోరణి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, విచ్చలవిడి అవినీతి మొదలైన విషయాలను క్రమంగా ప్రజలు గమనించటం మొదలుపెట్టారు. అందరికంటే ముందు స్పందించే లక్షణం అర్బన్ ఓటర్లు, విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులకూ ఉంటుంది. అందుకే జీహెచ్ఎంసీ ఫలితాలు టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్​ను సూచిస్తాయని చాలా మంది విశ్లేషకులు భావించారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించకున్నా పాతబస్తీ సహా అన్ని చోట్లా ఇచ్చిన పోటీ సామాన్యమేమీ కాదు. వచ్చే నాగార్జున​సాగర్ ఉప ఎన్నిక, అలాగే భవిష్యత్​ ఎన్నికల్లోనూ ఈ విజయాలు బీజేపీకి బూస్ట్​ ఇస్తాయి.

ప్రతిపక్షాలకు చాన్స్​ ఇవ్వకుండా ప్లాన్​

ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకునే అవకాశం లేకుండా సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దుబ్బాక ఫలితాన్ని బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వాడుకోకుండా వ్యూహం పన్నాడు. కానీ, గ్రేటర్​ ఫలితాలతో ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి రూలింగ్​ పార్టీ వాడని యుక్తులు, కుయుక్తులు లేనే లేవని చెప్పవచ్చు. ఆఖరికి సీఎం సమావేశానికి ఎల్బీ స్టేడియానికి వచ్చిన జనానికి కూడా ఓటర్ ఐడీ చూపిస్తే వెయ్యి రూపాయిలు ఇచ్చారని విస్తృతంగా ప్రచారం జరిగింది. మద్యం, నగదు పంపిణీ లాంటివి ఎలక్షన్ అబ్జర్వర్స్, పోలీస్ అధికారులు, ఇతర అధికారుల సమక్షంలో జరిగినట్లు ఆధారాలతో పాటు టీవీ చానెళ్లలో చూపించారు. ఇవేవి ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్నట్లు లేదు. పోలింగ్​రోజు సాయంత్రం ఐదు గంటలకు 35 శాతంగా చూపించిన ఓటింగ్ రాత్రికల్లా 46 శాతానికి అకస్మాత్తుగా ఎలా పెరిగిందో ఎలక్షన్ కమిషనే చెప్పాలి. నిజానికి కొన్ని ప్రాంతాల్లో తప్ప పోలింగ్ బూత్​లలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగింది. సాయంత్రం కల్లా చాలా బూత్​లలో ఓటర్ల జాడే లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక గంటలో పదిశాతం పోలింగ్ పెరగడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రముఖులకు షాక్​ తప్పలేదు

జీహెచ్ఎంసీ ఫలితాల్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవటం, కవిత ఇన్ చార్జ్ గా ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు కోల్పోవడం, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​కు వలసపోయిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రెండు స్థానాలను బీజేపీ గెలవడం, సుధీర్ రెడ్డి నియోజకవర్గమైన ఎల్బీనగర్ లో ఒక్క స్థానం మినహా అన్నీ బీజేపీ గెలవడం, ఉప్పల్​ ఎమ్మెల్యే సుభాష్​రెడ్డి భార్య కార్పొరేటర్​గా పోటీ చేసి ఓటమి పాలవ్వడం ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి.

సాగర్​లో టీఆర్ఎస్​ పట్టు నిలవడం అసాధ్యం

నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో అక్కడ ఆరు నెలల్లోపే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తన సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ ను టీఆర్ఎస్ నిలుపుకోవడమన్నది అసాధ్యమని దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం మారిన ఈ పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ ను ఆదరిస్తుందా? లేక బీజేపీని వరిస్తుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే.

బీజేపీలోకి పెరిగిన వలసలు

బీజేపీ నాయకత్వం మార్పు తర్వాత బండి సంజయ్ నేతృత్వంలో వరుసగా వస్తున్న పరిణామాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో గొప్ప మార్పునే తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ లో ఉన్న స్తబ్దత, టీడీపీ దాదాపుగా కనుమరుగుకావడం ఆయా పార్టీల్లో ఉన్న ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలపడడానికి ఊతమిస్తున్నాయి. రాబోయే రోజుల్లోనూ మరింత మంది నేతలు కమలం పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రధానిని ఎండగట్టి, బీజేపీని తూర్పార బట్టి ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌కు కూడా బహుశా స్థానికంగా టీఆర్ఎస్ బలహీనపడుతుందని అర్థమై ఉంటుంది. అందుకే ఆయన జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్టున్నారు. అయితే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసి విఫలమవడం చరిత్ర తెలిసినవారికి గుర్తుండే ఉంటుంది.

కపిలవాయి దిలీప్ కుమార్, అధ్యక్షుడు, రాష్ట్రీయలోక్ దళ్ తెలంగాణ