ఈ కెమెరా జ్వరం వచ్చిన వాళ్లను గుర్తిస్తుంది

ఈ కెమెరా జ్వరం వచ్చిన వాళ్లను గుర్తిస్తుంది

కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ తో పాటు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా…ఆయా రాష్ట్రాల్లో రోజు కరోనా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. వీరిని పరీక్షించి క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు . ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నా…చాలా వరకు కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం ప్రభుత్వాలకు ఇబ్బందిగానే ఉంది.

అయితే కేరళలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురంలో కరోనా కట్టడి కోసం…వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం కోసం థర్మల్ అండ్ ఆప్టికల్ ఇమేజింగ్ కెమెరాను కొనుగోలు చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్.

కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులతో పాటు, జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణతో చర్చలు  జరిపారు. ఇందులో భాగంగానే..మనుషులను గుర్తు పట్టడంతో పాటు…వారిలో జ్వరం ఉందో లేదో కూడా తెలుసుకునే లా తయారు చేసిన…ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీతో కూడిన థర్మల్ అండ్ ఆప్టికల్ ఇమేజింగ్ కెమెరా కొనుగోలు చేశారు. తన ఎంపీ లాడ్స్ నిధులను ఉపయోగించి తిరువనంతపురానికి థర్మల్ అండ్ ఆప్టికల్ ఇమేజింగ్ కెమెరాను తెప్పించారు.

ఈ కెమెరా ఆసియాలో లేకపోవడంతో జ‌ర్మ‌నీ నుండి కొనుగోలు చేశారు.ఈ కెమెరాను కొలోన్, పారిస్, లీప్జిగ్, బ్రస్సెల్స్, బహ్రెయిన్ తో పాటు దుబాయి లను కలుపుతూ అనేక విమానాలు మార్చుతూ  ఇండియాకు తీసుకొచ్చారు.  ఆ తర్వాత కేరళకు తీసుకొచ్చినట్లు తెలిపారు.

థర్మల్ అండ్ ఆప్టికల్ ఇమేజింగ్ కెమెరాను విమానాశ్రయం, రైల్వే స్టేషన్, ఎంసిహెచ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు శశిథరూర్. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఎంపీ లాడ్స్ నిధులు లేకపోవడం…ఆ పరికరాలను విదేశాలనుంచి ఇండియాకు తీసుకురావడానికి భారీగా ఖర్చు అవుతుండటంతో ప్రముఖ కార్పోరేట్ సంస్థల యజమానులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు జిల్లా అధికారుల సాయం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు శశిథరూర్.