ఈ జాగ్రత్తలు పాటిస్తే ..సమ్మర్‌‌లో సీజనల్‌‌ వ్యాధులు రావు

ఈ జాగ్రత్తలు పాటిస్తే ..సమ్మర్‌‌లో సీజనల్‌‌ వ్యాధులు రావు

ఎండలు ఠారెత్తిస్తున్నాయి.  టెంపరేచర్‌‌‌‌ విపరీతంగా పెరిగిపోతోంది. మరోవైపు కరోనా. ఇదంతా కాదన్నట్లు సీజనల్ వ్యాధుల భయం కూడా. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల జ్వరం,  జలుబు,  అతిసారం,  విరేచనాలు,  డయేరియా,  ఆటలమ్మ (చికెన్ పాక్స్),  కామెర్లు లాంటి వ్యాధులు సోకే  ప్రమాదాలున్నాయి.  అందుకే, ముందు జాగ్రత్త చర్యలు అవసరం.  జాగ్రత్త, అప్రమత్తతతోనే  హెల్త్​ను కాపాడుకోవచ్చని చెప్తున్నారు డాక్టర్లు.
 
కామెర్లు, హెపటైటిస్​

నీరు, ఆహారం కలుషితం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఆకలి కాకపోవడం, నోటికి రుచి తెలియకపోవడం, కళ్లు పచ్చగా మారడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. కామెర్ల బారిన పడితే నాలుక కింది భాగంలో పచ్చదనం క్లియర్‌‌‌‌గా కనిపిస్తుంది. లివర్‌‌‌‌ పెరిగి, పొట్టకు కుడివైపు నొప్పి వస్తుంది. వాంతులు కూడా అవుతాయి.

జాగ్రత్తలు
నీళ్లు, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తపడాలి. అందుకే, కాచి వడకట్టిన నీళ్లు తాగితే మంచిది. వంట చేసేటప్పుడు కూడా శుభ్రత పాటించాలి. 

అతిసారం, నీళ్ల విరేచనాలు

నీళ్లు, ఆహారం కలుషితం అవ్వడం వల్లనే ఈ వ్యాధులు కూడా సోకుతాయి. ఒక్కోసారి వైరస్,  బ్యాక్టీరియా వల్ల కూడా అతిసారం రావొచ్చు. కలరా వ్యాధి వల్ల కూడా విరేచనాలు,  వాంతులు అవుతాయి. అతిసారం బారినపడిన వారికి వాంతులు, విరేచనాలు అవుతాయి. దీంతో శరీరంలోని విటమిన్స్‌‌, మినరల్స్‌‌ కోల్పోయి నీరసించిపోతారు.  

జాగ్రత్తలు

నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించకూడదు.  కాచి, వడ పోసిన నీళ్లు మాత్రమే తాగాలి.  వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.  మల విసర్జనకు ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.  పాత్రలను మట్టితో తోమకూడదు.

ఆటలమ్మ (పొంగు, చికెన్ పాక్స్)

సాధారణంగా ఈ వ్యాధి చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకుతుంది. అలా సోకడాన్ని ‘సెకండరీ అటాక్​ రేట్​’ అంటారు. వ్యాధి సోకిన వారి ఒంటి మీద దద్దుర్లు లాంటివి వస్తాయి. జ్వరంతో పాటు తలనొప్పి, వెన్ను, గొంతునొప్పి ఉంటుంది. 

జాగ్రత్తలు

గాలి ద్వారా వ్యాధి సోకే అవకాశం ఉన్నందున ఆటలమ్మ వచ్చినవారికి దూరంగా ఉంటే మంచిది. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు కనిపించినవారు వెంటనే ఐసోలేషన్‌‌ లోకి వెళ్లిపోవాలి. తేలికపాటి ఆహారం తీసుకుంటే మంచిది. వ్యాధి తగ్గిన తర్వాత మరిన్ని ఇన్ఫెక్షన్లు 
సోకే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ 

ఎండాకాలంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.  ముందుజాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా నివారించవచ్చు.  వ్యక్తిగత, పరిసరాల శుభ్రత తప్పనిసరి. వ్యాధులు సోకినప్పుడు దగ్గర్లో ఉన్న  డాక్టర్​ను సంప్రదించాలి. తాజా  ఆహార పదార్థాలను తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి.
                                                                        - డాక్టర్  ఎల్​. వర్షి, చైల్డ్​ సైకియాట్రిస్ట్​