ఆజాదీ కా గౌరవ్ యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఖమ్మం రూరల్, వెలుగు : జాతీయవాదం ముసుగులో బీజేపీ పాలకులు సింగరేణి తో పాటు దేశాన్ని కార్పోరేట్సంస్థలకు అమ్మే కుట్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి ఖమ్మం జిల్లాలో ఆజాదీకా గౌరవ్ యాత్ర నిర్వహించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి కోదాడ క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్, కాల్వొడ్డు, మయూరి సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, ఇందిరానగర్వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చాక 50 ఏండ్ల వరకు జాతీయ జెండా ఎగరేయని ఆర్ఎస్ఎస్, బీజేపీ లీడర్లు.. అమృత్ ఉత్సవాల పేరిట ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ ప్రజలపై దేశ ప్రజలపై పన్నులు, అప్పుల భారం మోపారన్నారు.. రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియాను అమ్మకానికి పెట్టిన మోడీ.. 5జీ స్పెక్ర్టాంను తన స్నేహితుడైన అంబానీకి ఇచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. పాదయాత్రలో డప్పుల దరువు, మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం నగర అధ్యక్షుడు జావీద్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు వెంటనే ఇవ్వాలి
భద్రాచలం,వెలుగు: గోదావరి కరకట్టను పొడిగించి, ఎత్తు పెంచే పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. సీఎం భద్రాచలంలో ప్రకటించిన రూ.1000కోట్ల నిధులు వెంటనే మంజూరు చేయాలన్నారు. గోదావరి వరద ముంపునకు గురైన శిల్పినగర్ కాలనీ వాసులకు బుధవారం భద్రాచలంలో బీసీఆర్ ట్రస్టు తరఫున వరద సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరకట్టలే భద్రాచలంను కాపాడాయన్నారు. బీసీఆర్ ట్రస్టు సేవలను ఆయన కొనియాడారు. ట్రస్టు కన్వీనర్ బండారు శరత్‌బాబు, ఐలయ్య, లీడర్లు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, బాలరాజు, స్వామి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
మణుగూరు, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం... మణుగూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎస్కే సుభాని(42) విజయవాడలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడే రోడ్డుప్రమాదంలో గాయపడటంతో హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన ట్రీట్మెంట్కోసం హైదరాబాద్తరలించగా హాస్పిటల్లోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఫ్రీడమ్ రన్‌ను సక్సెస్ చేయాలి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 11న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న 2కే ఫ్రీడమ్ రన్‌ను ప్రజలు సక్సెస్ చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ పిలుపునిచ్చారు. ఫ్రీడమ్‌రన్ సందర్భంగా సర్ధార్‌పటేల్ స్టేడియంలో ప్రతి మండలానికి 100 చొప్పున టీషర్ట్లను సీపీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫ్రీడమ్రన్లో స్కూల్, కాలేజీ స్టూడెంట్స్, క్రీడాకారులు, కళాకారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ అంజనేయులు, ప్రసన్నకుమార్, జిల్లా స్పోర్స్ట్ అధికారి పరంధామరెడ్డిలు పాల్గొన్నారు. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో గురువారం నిర్వహించనున్న ఫ్రీడమ్రన్ను విజయవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ బుధవారం వేర్వేరు ప్రకనటల్లో పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఉదయం 6 గంటలకు ఫ్రీడమ్‌రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఏబీవీపీ ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ జడ్పీ సెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్టేట్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శ్రీకాంత్, యశ్వంత్, సాయి, తరుణ్, నాగార్జున, సందీప్ పాల్గొన్నారు.
జెండాల పంపిణీ
ఖమ్మం టౌన్,వెలుగు: ఖమ్మం సిటీలోని రోటరీ నగర్ లో భాజపా ఖమ్మం అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అర్బన్ టౌన్ మహిళా అధ్యక్షురాలు సుగుణ, సురేష్ బాబు పాల్గొన్నారు.
వనమా రాజీనామా చేస్తే నియోజకవర్గానికి ఫండ్స్
పాల్వంచ, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన ప్రతిచోటా ప్రభుత్వం అత్యధికంగా ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తోందని, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా రాజీనామా చేస్తే ఈ నియోజకవర్గానికి ఫండ్స్వస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) అన్నారు. బుధవారం పాల్వంచ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే పది లక్షల కొత్త పెన్షన్లు వచ్చాయన్నారు. కొత్తగూడెంలో వనమా రాజీనామా కోసం ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్ కుమార్, అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, ప్రసాద్, రమేశ్, సురేశ్సర్దార్ పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో పట్టాభిషేక మహోత్సవం
ఖమ్మం టౌన్,వెలుగు: ఖమ్మం సిటీ బల్లెపల్లి లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో బుధవారం విధుల నిర్వహణ పట్టాభిషేక మహోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన మహిళా పోలీస్స్టేషన్సీఐ శ్రీనివాస్జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో స్టూడెంట్స్ ను నాలుగు విభాగాలుగా విభజించి శాస్త్రవేత్తల పేర్లు పెట్టారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, కరస్పాండెంట్ బి.ప్రసాద్, ప్రిస్ట్ ఆంటోనీ, స్టూడెంట్స్,టీచర్స్ పాల్గొన్నారు.
ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి
పాల్వంచ,వెలుగు: భారత 75 వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని కలెక్టర్ డి.అనుదీప్ పిలుపునిచ్చారు. బుధవారం పాల్వంచ మండలం నారాయణరావుపేట పల్లె ప్రకృతి వనంలో జిల్లా ఎస్పీ వినీత్ తో కలిసి కలెక్టర్మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో వీధిలైట్లు వెలగడం లేదని, రహదారి, డ్రైనేజీ సమస్య ఉందని మహిళలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఇల్లందు, వెలుగు: వనమహోత్సవంలో భాగంగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్‌హరిప్రియ మున్సిపాలిటీలోని 19వవార్డు పట్టణ ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న 75 ఆకారంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
కారేపల్లి,వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని కారేపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో బుధవారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పాల్గొన్నారు. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సినిమాహాల్లో విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను వీక్షించారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు పెండ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. చుంచుపల్లి మండలకేంద్రానికి చెందిన కృష్ణ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. పెండ్లి విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండడంతో క్షణికావేశంతో బుధవారం రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఆ యువకుడిని 108 అంబులెన్స్ లో కొత్తగూడెం జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఖమ్మం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం సిటీలో బుధవారం 100 మీటర్ల పొడవున్న జాతీయ పతాకంతో జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూదన్‌కు జాతీయ పతాకాన్ని అందజేశారు.
