డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి.. నకల్ వద్దన్నందుకు కొట్టి చంపిన్రు

 డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి.. నకల్ వద్దన్నందుకు కొట్టి చంపిన్రు
  • నిజామాబాద్ జిల్లా బోధన్​లోని 
  • బీసీ బాయ్స్ హాస్టల్​లో ఘటన
  • పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్​లోని బీసీ బాయ్స్ హాస్టల్​లో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. నకల్ కొట్టొద్దని, కష్టపడి చదువుకోవాలని మందలించినందుకు ఇంటర్ స్టూడెంట్స్ మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో హాస్టల్ రూమ్​లోనే డిగ్రీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కేసు వివరాలుసోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారంతండాకు చెందిన హరిహలబస్సీ వెంకట్ (20) బోధన్​లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్​లో బీఏ ఫైన లియర్ చదువుతున్నాడు. 

తట్టికోట్​లో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్​లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 9గంటలకు వార్డెన్ స్వామి వెళ్లిపోయి.. హాస్టల్ బాధ్యతలను వెంకట్​కు అప్పగించాడు. స్టడీ అవర్​లో అనిల్ అనే స్టూడెంట్ ఇంటర్ ఎగ్జామ్స్ కోసం నకల్ చీటీలు కట్ చేసుకుంటున్నాడు. నకల్ కొట్టొద్దని అనిల్​ను వెంకట్ మందలించాడు. ఈ విషయాన్ని అనిల్ తన సోదరుడు దిలీప్ అతని ఫ్రెండ్ పరమేశ్​కు చెప్పాడు. అనిల్, దిలీప్ కలిసి తమ స్నేహితులు కృష్ణ, శివ, లక్ష్మణ్​తో రాత్రి 11 గంటలకు వెంకట్ రూమ్​కు వెళ్లారు. 

అప్పటికే పడుకున్న అతనిపై అందరూ కలిసి దాడి చేశారు. వెంకట్ స్పృహ తప్పి పడిపోవడంతో ఫిట్స్ వచ్చాయంటూ గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు.. వెంకట్ అప్పటికే చనిపోయాడని చెప్పారు. దీంతో ఐదుగురు అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత పోలీసులు వారితో పాటు వారికి సహకరించిన పరమేశ్​ను అరెస్ట్ చేశారు. 

వెంకట్ హత్యకు నిరసనగా అతని తల్లిదండ్రులు, బంధువులు, స్టూడెంట్ యూనియన్ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వార్డెన్ స్వామిని సస్పెండ్ చేయాలని, మృతుడి కుటుంబంలోని ఒకరికి గవర్నమెంట్ జాబ్, రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలన్నారు. అధికారులు వార్డెన్ స్వామిని సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి హాస్టల్​లో తాత్కాలికంగా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.గౌతమ్ కుమార్, ఏఐఎస్​బీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంజయ్​ తెలిపారు.