తెలంగాణ జాబ్స్ స్పెషల్.. నిరుద్యోగిత అంచనాలు

తెలంగాణ జాబ్స్ స్పెషల్.. నిరుద్యోగిత అంచనాలు

దేశంలో నిరుద్యోగితను తొలుత నేషనల్​ శాంపిల్​ సర్వే వారు చేపట్టారు. ఎం.ఎల్​.దంత్​వాలా కమిటీ సిఫారసుల మేరకు పంచవర్షీయ గణాంకాలను ప్రారంభించారు. అప్పటి నుంచి నేషనల్​ శాంపిల్​ సర్వే ఆర్గనైజేషన్​ ఎనిమిది సర్వేలు చేపట్టింది. చివరి సర్వేను 2011–12లో నిర్వహించారు. 2017 నుంచి పీరియాడిక్​ లేబర్​ ఫోర్స్​ సర్వే చేపడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు సర్వేలను చేపట్టారు. 2020–21 సర్వే ప్రకారం దేశంలో 4.2శాతం నిరుద్యోగిత ఉంది. గ్రామీణ నిరుద్యోగిత  3.3శాతం, పట్టణ నిరుద్యోగిత 6.7శాతంగా నమోదైంది. 

నేషనల్​ శాంపుల్ సర్వే వారు 1955లో తొమ్మిదో రౌండ్​లో ఎంప్లాయిమెంట్​ అన్ఎంప్లాయిమెంట్​ సర్వే (ఈయూఎస్​)ను నిర్వహించారు. ఆ తర్వాత ఎం.ఎల్.​ దంత్​వాలా కమిటీ సిఫారసులపై పంచవర్షీయ గణాంకాల సర్వేను 27వ రౌండ్​లో 1972–73లో మొదట చేపట్టారు. అప్పటి నుంచి ఎనిమిది సర్వేలు చేపట్టగా చివరిది 2011–12లో నిర్వహించారు. సంస్కరణల తర్వాత రోజువారీ స్థితి నిరుద్యోగిత పెరిగింది. 1993–94లో దేశంలో నిరుద్యోగిత 6.1శాతం, 2004–05 నాటికి 8.3శాతానికి పెరిగింది. వ్యవసాయ శ్రామికుల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. అల్ప ఉద్యోగిత కూడా పెరుగుతోంది. సంస్కరణల తర్వాత అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయేతర రంగ ఉపాధి విస్తరిస్తోంది. జీడీపీ వృద్ధి పెరుగుతున్నా వ్యవస్థీకృత రంగంలో ఉపాధి క్షీణిస్తోంది. దీనివల్ల విద్యావంతులైన యువతలో నిరాశ పెరుగుతోంది. ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 66వ రౌండ్​లో దేశ నిరుద్యోగిత 6.6శాతం.

ఎన్​ఎస్​ఎస్​ఓ 68వ రౌండ్ ​: 68వ రౌండ్​లో సాధారణ స్థితి నిరుద్యోగిత, వారంవారీ స్థితి నిరుద్యోగిత గ్రామాల కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంది. అయితే, రోజువారీ స్థితి నిరుద్యోగిత గ్రామాల్లో (5.7శాతం) కంటే పట్టణాల్లో 5.5శాతం తక్కువగా ఉంది. సంస్కరణల ప్రభావం గ్రామాల కంటే పట్టణాలపై ఎక్కువగా పడింది. దేశంలో నిరుద్యోగిత 5.6శాతం ఉంది. అన్ని కేటగిరీల్లో పురుషుల కంటే స్త్రీలలో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. ఐఎల్​ఓ అంచనాలు: 2018, జనవరిలో అంతర్జాతీయ శ్రామిక సంస్థ వరల్డ్​ ఎంప్లాయిమెంట్​ అండ్​ సోషల్​ అవుట్​లుక్ రిపోర్ట్​ – 2018ను విడుదల చేశారు. దీని ప్రకారం 2017లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య 18.3 మిలియన్లు. నిరుద్యోగిత 3.5శాతం. 

పీరియాడిక్​ లేబర్​ ఫోర్స్​ సర్వే (పీఎల్​ఎఫ్​ఎస్​) : ఉపాధి సృష్టి, ఉద్యోగిత, నిరుద్యోగిత సమస్యలు అనేవి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి. మినిస్ట్రీ ఆఫ్​ స్టాటిస్టిక్స్​ అండ్​ ప్రోగ్రామ్​ ఇంప్లిమెంటేషన్​ (ఎంఓఎస్​పీఐ) కింద గల ఎన్​ఎస్​ఎస్​ఓ వారు ఉద్యోగి, నిరుద్యోగిత సర్వేను చేపడతారు. పీరియడిక్​ లేబర్​ ఫోర్స్​ సర్వేను ఎన్​ఎస్ఓ 2017లో ప్రారంభించింది. 

ప్రధాన లక్ష్యాలు : పట్టణ ప్రాంతాల్లో వారంవారీ స్థితి నిరుద్యోగిత (సీడబ్ల్యూఎస్​) ప్రాతిపదికన మూడు నెలలకోసారి ఉపాధి, నిరుద్యోగిత సూచీలను (పనిచేసే జనాభా నిష్పత్తి, శ్రామిక శక్తి పాల్గొనే రేటు, నిరుద్యోగిత రేటు) అంచనా వేయడం.

– గ్రామీణ, పట్టణాల్లో సాధారణ స్థితి, వారంవారీ స్థితి నిరుద్యోగిత ప్రాతిపదికన సంవత్సరానికి ఒకసారి ఉపాధి, నిరుద్యోగిత సూచీలు గణించడం. 

మొదటి వార్షిక నివేదికను (2017–18)లో 2019లో రెండో వార్షిక నివేదికను(2018–19) 2020లో మూడో వార్షిక నివేదికను (2019–20) 2021లో నాలుగో వార్షిక నివేదిక (2020–21)ను 2022 జూన్​లో విడుదల చేశారు.    

లేబర్​ ఫోర్స్​ పార్టిసిపేషన్​ రేట్​ (ఎల్​ఎఫ్​పీఆర్​) : జనాభాలో శ్రమశక్తిలో గల వ్యక్తుల శాతాన్ని తెలుపుతుంది. పనిచేస్తున్నవారు, పనికోసం ఎదురు చూస్తున్నవారు, పనికి అందుబాటులో ఉన్నవారు దీనిలోకి వస్తారు. 

వర్కర్​​ పాపులేషన్ రేట్(డబ్ల్యూపీఆర్​): జనాభాలో పనిచేస్తున్న వారి శాతం గురించి తెలుపుతుంది. 

అన్​ ఎంప్లాయిమెంట్​ రేట్​ (యూఆర్​): శ్రమశక్తిలో నిరుద్యోగులుగా ఉన్నవారి శాతాన్ని చూపుతుంది. 

* పీఎల్​ఎఫ్​ఎస్​ 2017–18 ప్రకారం నిరుద్యోగిత 6.1శాతం
* పీఎల్​ఎఫ్​ఎస్​ 2018–19 ప్రకారం నిరుద్యోగిత 5.8శాతం
* పీఎల్​ఎఫ్​ఎస్​ 2019–20  ప్రకారం నిరుద్యోగిత 4.8శాతం
* పీఎల్​ఎఫ్​ఎస్​ 2020–21 ప్రకారం నిరుద్యోగిత 4.2శాతం
*పీఎల్​ఎఫ్​ఎస్​ 2020–21 ప్రకారం గ్రామీణ నిరుద్యోగిత 3.3శాతం. పట్టణ నిరుద్యోగిత 6.7, రెండు కలిపి 4.2శాతం ఉంది. దేశంలో పురుష నిరుద్యోగిత 4.5, స్త్రీల నిరుద్యోగిత 3.5. 

పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎల్​ఎఫ్​పీఆర్​, డబ్ల్యూపీఆర్​ ఎక్కువగా ఉంది. నిరుద్యోగిత మాత్రం పట్టణాల్లో ఎక్కువగా ఉంది. దేశంలో ఎల్​ఎఫ్​పీఆర్​, డబ్ల్యూపీఆర్​, యూఆర్​లు స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంది. దేశంలో స్త్రీలలో ఎల్​ఎఫ్​పీఆర్​, డబ్ల్యూపీఆర్​ పెంచేందుకు, యూఆర్​ తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంది. 

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ పీఎంఈజీపీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎంజీఎన్​ఆర్​ఈజీఏ, డీడీయూ– జీకేవై పథకాలు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ దీన్​ దయాళ్​ అంత్యోదయ యోజన – నేషనల్​ అర్బన్​ లైవ్లీ హుడ్​ మిషన్​ (డీఏవై  – ఎన్​యూఎల్​ఎం) తదితర పథకాలను అమలుపరుస్తోంది. ఆత్మనిర్భర్​ భారత్​ రోజ్​గార్​ యోజనను ప్రారంభించారు. దీనివల్ల ఉద్యోగాలు కల్పించే యాజమాన్యంపై ఆర్థికభారం తగ్గుతుంది. యాజమాన్యం చెల్లించే వాటా 12శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే హామీలేని రుణాల్లో 70శాతం మహిళలే ఉన్నారు. 

ALSO READ :బీఆర్ఎస్ హయాంలో చెట్టు పన్ను రద్దు: పద్మారావు గౌడ్

పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత : ఎన్​ఎస్​ఎస్​ఓ వారు పట్టణ ప్రాంతాల్లో గ్రామాలతోపాటు నిరుద్యోగిత అంచనా వేస్తారు. పట్టణాల్లో ఉపాధి వృద్ధిరేటు సంస్కరణల తర్వాత తగ్గింది. పట్టణాల్లో పారిశ్రామిక, విద్యా సంబంధ నిరుద్యోగిత ఉంది. 

విద్యావంతుల్లో నిరుద్యోగిత : ఇది ఎక్కువగా పట్టణాల్లో కనిపిస్తుంది. విద్యా వ్యవస్థలో లోపం, సాంకేతిక అర్హతలు లేకపోవడం, సామర్థ్యం కొరత, డిమాండ్​కు మించి సప్లయ్​ ఉండటం మొదలైనవి కారణాలు. సాధారణ నిరుద్యోగితకు గల కారణాలు దీనికి కూడా వర్తిస్తాయి. ఎక్కువ కాలం వృద్ధిరేటు తక్కువగా ఉండటం వల్ల, పెరిగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేకపోయాం. మరోవైపు విద్యావంతుల సప్లయ్​ డిమాండ్​ కంటే పెరుగుతున్నది. ప్రైవేట్​ ఉన్నత విద్య తక్కువ ధరకు లభించడం వల్ల కూడా విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. 

వ్యవసాయ నిరుద్యోగిత: వ్యవసాయ నిరుద్యోగితలో కాలిక, ప్రచ్ఛన్న, క్రానిక్​, సాధారణ స్థితి నిరుద్యోగితలు కనిపిస్తాయి. 

రుతు సంబంధ నిరుద్యోగిత: వ్యవసాయ రంగంలో కాలిక నిరుద్యోగిత సాధారణంగా ఉంటుంది. 2018–19లో స్థూల పంట భూమిలో స్థూల నీటిపారుదల గల భూమి 52శాతం. ఇందులో కూడా 19శాతం సేద్యపు భూమిలో మాత్రమే రెండు లేక అంతకంటే ఎక్కువ పంటలు పండుతాయి. మిగతా 81శాతం భూమిలోని రైతులు 3 నుంచి నాలుగు నెలలు ఉపాధి లేకుండా ఉంటారు. వీరిని కాలిక నిరుద్యోగులు అంటారు. రెండో వ్యవసాయ శ్రామిక పరిశీలనా కమిటీ 1956–57లో వ్యవసాయ శ్రామికులు 237 రోజులు ఉపాధిలో ఉంటారని పేర్కొన్నారు. అంటే మూడు నుంచి నాలుగు నెలలు నిరుద్యోగితలో ఉంటారు. ఉపాధి వ్యాకోచత్వం క్షీణించడంతో కాలిక నిరుద్యోగిత ఇంకా పెరుగుతున్నది. సంస్కరణల తర్వాత వ్యవసాయ ఉపాధి వ్యాకోచత్వం రుణాత్మక వృద్ధిని నమోదు చేసుకున్నది. 

పారిశ్రామిక నిరుద్యోగిత: ఆర్థిక వృద్ధి జరిగే కొద్దీ పారిశ్రామిక రంగం విస్తరిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మనదేశంలో మాన్యుఫాక్చరింగ్​ రంగం విస్తరిస్తూ ఉపాధిని నిదానంగా కల్పిస్తున్నది. మాన్యుఫాక్చరింగ్​ రంగ ఉపాధి వ్యాకోచత్వం తక్కువగా ఉంది. అందుకే పారిశ్రామిక నిరుద్యోగిత పెరిగింది. దీంతోపాటు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే జనాభా పెరగడం, పట్టణ జనాభా వేగంగా పెరగడం పారిశ్రామిక వృద్ధి మితంగా ఉండటం, సంస్కరణల ప్రారంభంలో ఉపాధి రహిత పారిశ్రామిక వృద్ధి మొదలైన కారణాల వల్ల నిరుద్యోగిత పెరుగుతోంది. ముఖ్యంగా పారిశ్రామీకరణ ప్రక్రియ నెమ్మదిగా ఉండటం, సరిపడని సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం వల్ల పారిశ్రామిక నిరుద్యోగిత పెరిగింది. 1960 దశకం మధ్య నుంచి 1980 దశకం ప్రారంభం వరకు పారిశ్రామిక రంగం దాదాపు స్తబ్దతలో ఉంది. ఎక్కువ పరిశ్రమలు పెద్ద నగరాల్లో కేంద్రీకృతం కావడం వల్ల గ్రామాల నుంచి శ్రామికులు వలస పోవడం వల్ల కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. అందుకే పరిశ్రమలను గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 

ప్రచ్ఛన్న నిరుద్యోగిత: భారత వ్యవసాయ రంగంలో మిగులు శ్రామికులు చెప్పుకోదగిన విధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి సరైన గణాంకాలు లేవు. భట్టచారి, అశోక్​రుద్రలు పశ్చిమబెంగాల్​, బిహార్​లోని కొన్ని గ్రామాల్లో, శకుంతలా మెహ్రా దేశ వ్యాప్తంగా ప్రారంభంలో ప్రచ్ఛన్న నిరుద్యోగితకు సంబంధించి అంచనాలు వేశారు. 1960 దశకంలో వ్యవసాయంలో 17.1శాతం వర్క్​ ఫోర్స్​ మిగులుగా ఉందని శకుంతలా మెహ్రా అంచనా వేశారు. ఈ మధ్య ఇండియన్ ఎంప్లాయిమెంట్​ రిపోర్ట్​ 2016లో అజిత్​ కే ఘోష్​ దేశ వ్యాప్తంగా 2015-16లో 52 మిలియన్లు మిగులు పనివాళ్లు ఉన్నారని అంచనా వేశారు. 

సాధారణ స్థితి నిరుద్యోగిత: గ్రామాల్లో కాలిక, ప్రచ్ఛన్న నిరుద్యోగిత నుంచి సాధారణ నిరుద్యోగితను వేరు చేయలేం.