క్వింటాకు 10 కిలోల కోత..తరుగుకు ఒప్పుకుంటే ‘ఏ’ గ్రేడ్.. లేదంటే ‘బీ’ గ్రేడ్

క్వింటాకు 10 కిలోల కోత..తరుగుకు ఒప్పుకుంటే ‘ఏ’ గ్రేడ్.. లేదంటే ‘బీ’ గ్రేడ్
  • తరుగుకు ఒప్పుకుంటే ‘ఏ’ గ్రేడ్.. లేదంటే ‘బీ’ గ్రేడ్
  • రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల సిండికేట్‌.. వాళ్లు చెప్పిందే రేటు
  • కటింగ్‌కు ఒప్పుకుంటే క్వింటాకు రూ.2,040.. లేదంటే బీ గ్రేడ్ కింద 1,800
  • ఇదేమని రైతులు ప్రశ్నిస్తే అన్‌లోడ్ చేస్తలే
  • మిల్లుల వద్ద లారీల బారులు.. సెంటర్లలో ఆగిన కాంటాలు
  • రోజుకు లక్ష టన్నులు కొంటామన్న సర్కారు..
  • కానీ 35 రోజుల్లో కొన్నవి 23.42 లక్షల టన్నులే
  • సెంటర్లలో పడిగాపులు పడుతూ రైతుల అరిగోస

 

నెట్‌వర్క్ / హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాల వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతులను మిల్లర్లు ఇంకింత దెబ్బకొడుతున్నారు. కొనుగోలు సెంటర్లలో కాంటా పెట్టి పంపిన వడ్లను దింపుకోకుండా సతాయిస్తున్నారు. తేమతో సంబంధం లేకుండా క్వింటాల్‌కు 8 నుంచి 10 కిలోల తరుగుకు ఒప్పుకుంటే ‘ఏ’ గ్రేడ్‌గా పరిగణించి రూ.2,040 రేటు కట్టిస్తున్నారు. కటింగ్‌కు ఒప్పుకోకుంటే ‘బీ’ గ్రేడ్ కింద పరిగణించి రూ.1,650 నుంచి రూ.1,800 మాత్రమే ఇస్తున్నారు. ఈ రెండింటికీ ఒప్పుకోని రైతుల వడ్లను అసలు దింపుకోవడం లేదు. నెలరోజులకు పైగా సెంటర్లలో పడిగాపులు పడి, హమాలీ చార్జీలు, ట్రాక్టర్లు, లారీల కిరాయిలు కట్టుకొని వచ్చిన రైతులు.. తిరిగి వెనక్కి వెళ్లలేక మిల్లర్లు ఇచ్చిన రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకొని నిండా మునుగుతున్నారు. తడిసిన, మొలకెత్తిన వడ్లను ఎలాంటి కొర్రీలు లేకుండా తీసుకుంటామని ప్రకటించిన సర్కారు.. తర్వాత పట్టించుకోకపోవడంతో మిల్లర్లు ఆడింది ఆటగా మారింది. తడిసిన వడ్లను సేకరించడం వల్ల జరిగే నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకురాకపోవడంతో మిల్లర్లు సిండికేట్‌గా మారి అందినకాడికి దోచుకుంటున్నారు.

సెంటర్లలోనే వడ్లు..

రాష్ట్రవ్యాప్తంగా సిండికేట్‌గా మారిన మిల్లర్లు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను ఇన్​టైంలో అన్​లోడ్​చేసుకోవడం లేదు. అకాల వర్షాల టైంలో తడిసిన, మొలకెత్తిన వడ్లను దింపుకునేందుకు సతాయించారు. దీనిపై అప్పట్లో సర్కారు సీరియస్ అయ్యింది.

తేమతో సంబంధం లేకుండా సెంటర్ల నుంచి వచ్చే వడ్లను మిల్లర్లు దింపుకోవాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీన్ని అంతే సీరియస్‌‌గా తీసుకున్న మిల్లర్లు.. సిండికేట్‌‌గా మారి, సెంటర్ల నుంచి వచ్చే వడ్లను దింపుకోవడం పూర్తిగా ఆపేశారు. రైతులు నేరుగా తెచ్చే వడ్లను క్వింటాల్‌‌కు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే చెల్లించారు. వర్షాలు పోయి ఎండలు మండుతున్నా, వడ్లలో మాయిశ్చర్ లేకున్నా కొర్రీలు పెడ్తున్నారు. క్వింటాల్‌‌కు 8 నుంచి 10 కిలోల కోతలకు ఒప్పుకుంటేనే రూ.2040 ఇస్తామని చెబుతున్నారు. కటింగ్​కు ఒప్పుకోకుంటే రూ.1,650 నుంచి రూ.1800 కట్టిస్తామని చెప్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతుల వడ్లను దింపుకోవడం లేదు. దీంతో మిల్లర్ల దగ్గర లారీలు, ట్రాక్టర్లు బారులుతీరుతున్నాయి. ఫలితంగా సెంటర్లలో వడ్లు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి.

30 శాతం దాటని కొనుగోళ్లు

ఏప్రిల్‌‌ 11 నుంచి ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్​లలో వడ్ల కొనుగోళ్లు షురూ అయ్యయి. గడిచిన 35 రోజుల్లో 23.42 లక్షల టన్నుల ధాన్యమే కొన్నారు. ఈ యాసంగి కొనుగోళ్ల లక్ష్యం 80.46 లక్షల టన్నుల్లో ఇది 29 శాతమే. రోజుకు లక్ష టన్నులు కొంటామని ప్రభుత్వ పెద్దలు, ఆఫీసర్లు చెప్పిన మాటలు ఉత్తవే అయ్యాయి. సెంటర్లలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కొన్ని సెంటర్లలో వడ్లు తెచ్చి పోశాక నెల రోజులకు గానీ రైతు వంతు రావడం లేదు. తీరా కాంటా పెట్టాక లారీలు రాక బస్తాలు అలాగే ఉంటున్నాయి. వాటిపైనా పట్టాలు కప్పుకొని కాపలా కాయాల్సి వస్తోంది. సూర్యాపేట లాంటి జిల్లాల్లో రైతులే రోడ్ల మీదికి వచ్చి లారీ డ్రైవర్లను బతిమిలాడుకుంటున్నారు. లారీల్లో లోడ్​చేసి మిల్లులకు పంపిన బస్తాలను కటింగులకు ఒప్పుకుంటే తప్ప వారాల తరబడి దింపుకోవడం లేదు. లారీలు లేకపోవడం వల్ల సెంటర్లలో కాంటాలు బంద్​పెడ్తున్నారు. 

ఇదే మని అడిగితే మిల్లర్లు దింపుకోకుంటే తాము ఏమిచేయగలమని ప్రశ్నిస్తున్నారు. దీంతో కాంటాల కోసం ఎదురుచూసి చూసి విసిగి వేసారుతున్న రైతులు అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు.

మిల్లులు రెండ్రోజులు బంద్ చేస్తే తెలుస్తది

  • అడిషనల్ కలెక్టర్ రివ్యూ 
  • మీటింగ్‌‌లో మిల్లర్ల బెదిరింపులు

యాదాద్రి, వెలుగు: ‘‘వడ్ల కొనుగోళ్లు నిలిపేసి, మిల్లులను బంద్ చేస్తే.. రైతులకు మా విలువ తెలిసివస్తుంది’’ అంటూ యాదాద్రి జిల్లా రైస్ మిల్లర్లు బెదిరింపులకు దిగారు. తూకాల్లో మోసం చేస్తున్నారనే ఆరోపణలతో ఆలేరు, భూదాన్​పోచంపల్లిలోని రెండు రైస్​మిల్లులకు చెందిన వే బ్రిడ్జిలను ఆఫీసర్లు ఇటీవల సీజ్​చేశారు. ఆ రెండు మిల్లులు ఇప్పటివరకు అదనంగా సేకరించిన వడ్లకు సంబంధించిన సొమ్ము రికవరీకి చర్యలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం భువనగిరిలో మిల్లర్లతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వడ్ల కొనుగోలులో కీలకంగా ఉంటున్న తమపై చర్యలు తీసుకోవడం అవమానంగా ఉందంటూ కొందరు మిల్లర్లు అన్నారు. చిన్న తప్పులను కూడా ఆఫీసర్లు భూతద్దంలో పెట్టి చూపుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘తడిసిన వడ్లు సైతం కొంటున్నం. అయినా మాపై ఆరోపణలు చేస్తున్నరు. చిన్న తప్పులకూ చర్యలు తీసుకుంటున్నరు. జిల్లాలో రెండ్రోజులు మిల్లులు బంద్ చేస్తం.. అప్పుడు మీకు, రైతులకు మా విలువ తెలిసొస్తది” అని చెప్పడం గమనార్హం. వెంటనే శ్రీనివాసరెడ్డి కల్పించుకొని.. ‘‘మీ మిల్లులను బంద్​పెడ్తే వ్యవసాయం ఆగుతుందా? నిబంధనలకు అనుగుణంగా వడ్లను అన్​లోడ్ చేసుకోండి. తేమ, తాలు పేరుతో తూకంలో కోతలు పెడ్తే చర్యలు తప్పవు. క్రాప్‌‌ హాలిడే అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా రైతులు వరిని సాగు చేసిన్రు. మీరు మిల్లులు బంద్​పెడ్తే ఏదీ ఆగదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను వెంటవెంటనే అన్​లోడ్ చేసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులైందని, అయినా కాంటా పెడతలేరని  జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద  రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై వడ్ల బస్తాలు వేసి వాటిపై కూర్చొని ఇలా నిరసన తెలిపారు.రైస్​ మిల్లర్ల​ దోపిడీని అరికట్టాలంటూ జనగామ జిల్లా విశ్వనాథపురంలో సోమవారం పురుగుల మందు డబ్బాతో నిరసన తెలుపుతున్న రైతులు

సెంటర్ల వడ్లు పోసి 15 రోజులు దాటింది

సెంటర్‌‌లో వడ్లు పోసి 15 రోజులు దాటింది. ఇంత వరకు కాంటా కాలేదు. కాంటా పెట్టిన వడ్లు కూడా లారీలు రాట్లేదని సెంటర్లనే ఉంచుతున్నరు. ఇంకా ఆగాలని చెబుతున్నరు. రోజూ ఉదయం 9 గంటలకు ఐకేపీ సెంటర్‌కు పోయి.. సాయంత్రం వరకు వడ్ల కుప్పల వద్ద కావలి కాయాల్సి వస్తోంది.
- సాయిలు, సూర్యాపేట జిల్లా