విడాకులు అయ్యాయి కాబట్టి డబ్బులు తిరిగివ్వండి

విడాకులు అయ్యాయి కాబట్టి డబ్బులు తిరిగివ్వండి

పెండ్లి కుదిరిందంటే చాలు ప్రి–వెడ్డింగ్ ఫొటో, వీడియో షూటింగ్​లతో తెగ బిజీ అయిపోతారు అమ్మాయిలు, అబ్బాయిలు. పెండ్లిండ్ల సీజన్​లో ‘భలే మంచి బేరం’ అనుకుంటూ ఫొటోగ్రాఫర్లు వీలైనన్ని ఆర్డర్లు తీసుకోవడం సహజం. నాలుగు డబ్బులు వస్తాయని ఎక్కువ ఆర్డర్లు ఒప్పుకోవడం వరకు ఓకే. కానీ పెండ్లయిన కొన్నేండ్ల తరువాత పెండ్లి కూతురు వచ్చి ‘మా పెండ్లప్పుడు ఫొటోలు తీయడం కోసం మేం మీకిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి. లేదంటే కోర్టుకి వెళ్తాం’ అంటూ క్లయింట్​లు ఎవరైనా వస్తేనే నెత్తినొప్పి. అసలు ఇలాంటి వాళ్లు ఉంటారా అని బుగ్గలు నొక్కుకోకండి. అలాంటి ఒక చాట్​ ఈ మధ్య ఫేస్​బుక్​లో తెగ వైరల్​ అయింది.

వివరాల్లోకి వెళ్తే...

2019లో పెండ్లప్పుడు ఫొటోలు తీయించుకునేందుకు ఫొటోగ్రాఫర్​ను ఏర్పాటుచేసుకున్నారు. నాలుగేండ్ల తరువాత అప్పటి పెండ్లికూతురు ఫొటోగ్రాఫర్​ను ‘నా డబ్బులు నాకు ఇచ్చెయ్యి’ అని అడిగింది. ఇదేదో ప్రాంక్​ అనుకునేరు, కానేకాదు. సీరియస్​ మ్యాటరే. ఆఖరికి లాయర్​ నోటీసులు ఇస్తా అని బెదిరించింది కూడా. అయినా సరే ‘ఫొటోలకు రీఫండ్​ ఎలా ఇస్తారు తల్లీ?’ అంటూ ఫొటోగ్రాఫర్​ మొత్తుకున్నా ఆమె వినలేదు.

‘‘నా పెండ్లప్పుడు ఫొటోలకోసం మీకిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మేం ఇద్దరం విడిపోయాం. అప్పటి జ్ఞాపకాలు నాకు అవసరం లేదు. ఆ ఫొటోలు తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చేయండి’’ అంది.దాంతో ఆ ఫొటోగ్రాఫర్​ ‘ఏంటండీ జోక్​ చేస్తున్నారా?’ అని అమాయకంగా అడిగాడు.‘‘లేదు. నేను నిజంగానే అడుగుతున్నా”అని ఆమె సీరియస్​గా అన్నది.‘‘అయితే ఆ సర్వీస్​ నాన్​ రీఫండబుల్​” అన్నాడు ఫొటోగ్రాఫర్​.‘‘అలాగంటే ఎలా? నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వను, కుదరదు అనడానికి వీలులేదు. ఎందుకంటే నువ్వు ఇంకా ఫొటోగ్రఫీ చేస్తున్నావు’’ అని పట్టు బట్టింది. అతను ఆ మాటల్ని సీరియస్​గా తీసుకోలేదు. దాంతో లీగల్​ యాక్షన్​ తీసుకుంటా అని బెదిరించింది.‘‘ఇప్పటికీ ఇది ప్రాంక్​ అనే అనుకుంటున్నా. రీఫండ్​ ఇవ్వడం కుదరదు’’ అన్నాడు ఫొటోగ్రాఫర్. 

ఆ క్లయింట్ ఎంతకీ వినకపోగా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అంది. 2019లో నేనిచ్చిన డబ్బులో 70 శాతం ఇచ్చినా చాలు అంది. ‘‘అయినా సరే ‘నో’. మీ లాయర్​నే నాతో మాట్లాడమనండి’’ అన్నాడు ఆ ఫొటోగ్రాఫర్​.మొత్తానికి ఇదో రకం డిమాండ్​ అన్నమాట. ఇది చదివిన నెటిజన్స్​ ‘అది బహుశా ప్రాంక్​ కావచ్చు ఇలా బుద్ధిలేకుండా ఎవరూ అడగరు’ అన్నారు.
అసలు ఆమె ఆలోచనా ధోరణి ఎటుపోతుందో? అని కామెంట్​ చేశారు మరో నెటిజన్​.