పోలీస్​స్టేషన్లలో దొంగలు పడ్డరు!

పోలీస్​స్టేషన్లలో దొంగలు పడ్డరు!
  •      పట్టుకున్న గంజాయి అమ్ముతున్న భద్రాచలం టౌన్​ కానిస్టేబుల్​​
  •     బూర్గంపాడు పీఎస్​లో గంజాయి, బైక్​లు ఎత్తుకెళ్లిన యువకులు
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు స్టేషన్లలో ఘటనలు

భద్రాచలం/బూర్గంపాడు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు ఘటనలు పోలీసు వర్గాల్లో కలకలం రేపాయి. భద్రాచలం టౌన్​పోలీస్​స్టేషన్​లో పని చేసే ఓ కానిస్టేబుల్​ గంజాయి దందా చేస్తూ పట్టుబడగా, మరికొందరు యువకులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్​లో సీజ్​ చేసిన గంజాయితో పాటు టూ వీలర్లు దొంగిలించి దొరికిపోయారు. అయితే ఈ విషయాలు బయటపడినా రెండు పోలీస్​స్టేషన్ల అధికారులు గాని, ఉన్నతాధికారులు గాని నోరు విప్పడం లేదు. 

బెట్టింగులకు అలవాటు పడి..

భద్రాచలం టౌన్​లో పని చేసే రమేశ్​అనే కానిస్టేబుల్​ఆన్​లైన్ బెట్టింగ్​తో పాటు ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డాడు. మొదట్లో రూ. కోటి 20 లక్షలు రాగా అత్యాశకు పోయి వాటినీ పోగొట్టుకున్నాడు. ఎలాగైనా పోయిన వాటిని తిరిగి పొందాలని అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టాడు. అవి కూడా పోవడంతో సుమారు రూ.40 లక్షల అప్పు చెల్లించలేని స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ​ఇచ్చినా మార్పు రాలేదు.  డైరెక్ట్​గా గంజాయి వ్యాపారంలోకి దిగాడు.

ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని భూపాలపల్లిలో కొద్ది రోజుల కింద కొంతమంది గంజాయి స్మగ్లర్లు అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. విచారించగా కానిస్టేబుల్​రమేశ్​ నుంచి గంజాయి కొన్నట్టు చెప్పారు. దీంతో అక్కడి పోలీసులు మంగళవారం ఉదయం కానిస్టేబుల్​రమేశ్​ను అదుపులోకి తీసుకుని భూపాలపల్లి తీసుకువెళ్లి విచారించారు. వారి ఎంక్వైరీలో రమేశ్​5 కిలోల గంజాయిని రూ.15వేలకు అమ్మినట్లుగా తేలింది. తనిఖీల్లో దొరికిన గంజాయిలో కొంత పక్క కు తీసి అమ్ముకున్నానని చెప్పినట్టు సమాచారం.

పోలీస్​స్టేషన్​నూ వదల్లే ..   

భద్రాద్రి జిల్లాలోని బూర్గంపాడు పోలీస్​స్టేషన్​ను కొంతకాలం కింద పక్కనున్న కొత్త బిల్డింగ్​లోకి షిఫ్ట్​చేశారు. రికవరీ చేసినవాహనాలు, సీజ్​చేసిన గంజాయిని పాత బిల్డింగ్​లోనే ఉంచారు. దీంతో బూర్గంపాడుకు చెందిన ఇద్దరు, సారపాకకు చెందిన ముగ్గురు కొద్దిరోజుల కింద రెండు బైక్​లతో పాటు గంజాయిని దొంగిలించారు. పోలీసులకు తెలిసినా బయటపెట్టలేదు. మూడు రోజుల కింద కొత్తగూడెం సీసీఎస్​ పోలీసులు ఐదుగురు దొంగల్లో ఓ గంజాయి స్మగ్లర్​ను అరెస్ట్ చేశారు. ప్రశ్నించగా జరిగిందంతా చెప్పాడు. తర్వాత పీఎస్​లో  విచారించగా సీజ్​చేసిన గంజాయి పోయింది నిజమేనని ఒప్పుకున్నారు.  దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్​చేసి 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.