
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని గాజులపేట వీధిలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిం చారు. పక్కపక్కనే ఉండే రెండిండ్ల తాళాలను పగులగొట్టి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న షేక్ సాబీర్ అనే వ్యక్తి ఇంట్లోకి మంగళవారం మధ్యాహ్నం చొరబడిన దుండగులు బీరువాను పగులగొట్టి మూడున్నర తులాల బంగారం, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మహ్మద్ అన్వర్ ఇంటి తాళాలను కూడా పగులగొట్టి బీరువాలోని రూ.80 వేల నగదు మూడు తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే గాజులపేట వీధిలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించడం కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా గాలిస్తున్నామని చెప్పారు.
కడెంలో మహిళ ఇంట్లో దోపిడీ
కడెం, వెలుగు: కడెం మండలం లింగాపూర్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లో సోమవారం అర్ధ రాత్రి దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లారు. గ్రామానికి చెందిన పడాల గంగవ్వ(57) భర్త ఆరు నెలల క్రితమే చనిపోయాడు. ఇద్దరు కొడుకులు వేరే ఇండ్లలో ఉంటుండగా ఆ గంగవ్వ ఒక్కతే ఉంటోంది. గంగవ్వ మద్దిపడగలో ఉండే కూతురి ఇంటికి వెళ్లగా.. ఇంట్లో ఎవరు లేరని గుర్తించిన దొంగలు అర్ధరాత్రి చొరబడి ఇంట్లోని 3 తులాల బంగారం,10 తులాల వెండి, రూ.లక్షా 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం గుర్తించిన కొడుకులు పోలీసులకు తెలియజేయడంతో ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం ద్వారా విచారణ చేపడుతున్నట్లు తెలిపారు