షాపులో చోరీ.. దొంగ ఏం తీసుకెళ్లాడో తెలుసా.?

షాపులో చోరీ.. దొంగ ఏం తీసుకెళ్లాడో తెలుసా.?

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లిగడ్డల ధర రూ.100 ను దాటాయి. సామాన్యులు, పేద వారు ఉల్లి కొంటే జేబుకు చిల్లు పడుతుందేమోనన్న భయంతో కొనటమే మానేశారు. జిహ్వా చాపల్యాన్ని చంపుకొని కొందరు ఉల్లి లేకుండానే వంటలు చేస్తున్నారు. దేశం అంతటా ఇలాంటి పరిస్థితి రావడంతో ఉల్లిగడ్డలు బంగారం కంటే విలువైనవిగా మారాయి. అలాంటి విలువైన ఉల్లిగడ్డల కోసం పశ్చిమ బెంగాల్‌ మిడ్నాపూర్ జిల్లాలో ఓ దొంగతనం జరిగింది.

జిల్లాలోని సుతాహటాలో ఉన్న ఓ కూరగాయల దుకాణం యజమాని అక్షయ్ దాస్ కి ఈ వింత పరిస్థితి ఎదురైంది. సోమవారం రాత్రి తన షాప్ కి తాళాలు వేసి ఇంటికి వెళ్లిన అక్షయ్ దాస్.. మంగళవారం ఉదయం వచ్చి చూసుకునేసరికి.. షాపులో సరుకు అంతా చిందరవందరగా పడి ఉండడం గమనించాడు. షాపులో దొంగలుపడినట్టు గుర్తించిన యజమాని.. వెంటనే తన గల్లా పెట్టే దగ్గరకు వెళ్లి చూసుకున్నాడు. ఆ పెట్టెలో డబ్బు ఉన్నది ఉన్నట్టు గానే ఉంది. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా మాయమవ్వలేదు. కానీ షాపులోని రూ.50 విలువైన ఉల్లిపాయల సంచులు మాత్రం కనిపించలేదు. దీంతో వచ్చిన దొంగలు ఉల్లి దొంగలే అని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు కూడా.. క్యాష్ బాక్స్ లోని డబ్బును ఎత్తుకెళ్లకుండా, ఉల్లిపాయలు చోరీకి గురవడంతో ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకుంటామని చెప్పారు.

Thieves decamp with onions from West Bengal shop, leave cash