నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ రామాలయంలో చోరీకి గురైన పూరాతన దేవతా విగ్రహలు, కిరీటాలను దొంగలే తిరిగి తీసుకువచ్చి అప్పజెప్పారు. రెంజల్ పీఎస్లో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో పోలీసులు వివరాలు తెలియజేశారు. జనవరి 7న రాత్రి టెంపుల్లోని సీతారాముల పంచలోహ, ఇత్తడి విగ్రహాలు, 5 వెండి కిరీటాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసు దర్యాప్తు నడుస్తుండగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రామాలయానికి ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘ఉమ్రి బిర్జూ మహరాజ్’ ఆలయంలో జరిగే అన్నదానానికి సామగ్రి పంపించాడని పూజారితో చెప్పి ఆ సామాన్లు అక్కడ పెట్టి వెళ్లిపోయారు. సోమవారం పూజారి ఆ మూట విప్పి చూడగా అన్నదాన సామగ్రితో పాటు దొంగిలించిన విగ్రహాలు, కిరీటాలు ఉన్నాయి. దీంతో దొంగలు చేసిన పనికి పశ్చాత్తాప పడో లేక ఏమన్నా అవుతుందనే భయంతో విగ్రహాలు తీసుకువచ్చి ఇచ్చి ఉంటారని గ్రామస్తులు అనుకుంటున్నారు.
