
మెదక్, వెలుగు: పోడు భూముల సర్వే విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లిలో రైతులు ఆందోళన చేశారు. పంచాయతీ ఆఫీస్ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన 135 మంది దాదాపు160 ఎకరాలు పోడు భూమి సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గతేడాది పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పగా అందరూ అప్లై చేసుకున్నారన్నారు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు, ఫారెస్ట్ఆఫీసర్లు కలిసి పోడు భూముల సర్వే చేస్తుండగా ఆఫీసర్లు 73 మంది రైతుల పేర్లు మాత్రమే ఆన్లైన్ లో ఉన్నాయని, వారి భూములే సర్వే చేస్తామంటున్నారని, ఆన్లైన్లో లేని 62 మంది రైతుల భూములు సర్వే చేస్తలేరని వాపోయారు. దీంతో ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అందరి భూములు సర్వే చేసేలా.. అర్హులైన వారందరికీ పట్టాలందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు మహేశ్మాట్లాడుతూ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రైతుల భూములు మాత్రమే ఆఫీసర్లు సర్వే చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరైంది కాదని పారదర్శకంగా సర్వే చేసి అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ కు శమ్నాపూర్ రైతుల కంప్లైంట్
ఇదే మండలంలో శమ్నాపూర్లో కూడా పోడు భూముల సర్వే సరిగ్గా జరగడం లేదని శుక్రవారం గ్రామానికి చెందిన దళితులు మహాజన సోషలిస్ట్ పార్టీ లీడర్ల ఆధ్వర్యంలో కలెక్టర్కు కంప్లైంట్చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ.. గ్రామంలో 50 మంది రైతులం దశాబ్ధాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది పట్టాల కోసం అప్లై చేశామని తెలిపారు. ఇటీవల గ్రామంలో సర్వే చేపట్టిన పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ఆఫీసర్లు ఇష్టారీతిగా సర్వే చేస్తున్నారని, ఎందుకలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్తలేరని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుంటలేరన్నారు. విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని నాయకులు బాల్రాజ్, రవి, సిద్దిరాములు, రాజయ్య కోరారు.