ఆదేశాలు ఇవ్వడం త‌ప్ప ఏం చేయ‌రా? మోడీ ప్ర‌సంగంపై ఒవైసీ ఫైర్

ఆదేశాలు ఇవ్వడం త‌ప్ప  ఏం చేయ‌రా? మోడీ ప్ర‌సంగంపై ఒవైసీ ఫైర్

వ‌చ్చే నెల 3వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్ర‌ధాని మోడీ చేసిన‌ ప్ర‌సంగంపై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మ‌రో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఒక్క ట్వీట్ లో చెప్పేసి ఉండొచ్చ‌ని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స‌హా ప‌లు రాష్ట్రాలు కోరుతున్న ఆర్థిక స‌హాయం, ఇత‌ర ఉప‌శ‌మ‌న ప్యాకేజీలు, మార్గ‌ద‌ర్శ‌కాల‌ గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం దారుణ‌మంటూ ట్వీట్ చేశారు.

పేద‌ల‌ను డ‌బ్బున్నోళ్ల ద‌యాదాక్షిణ‌యాల‌కు వ‌దిలేస్తారా?

దేశంలో ఈ రోజు మెజారిటీ ప్ర‌జ‌లు నిలువ నీడ లేకుండా, ఆక‌లితో బ‌తుకుతున్నార‌ని అన్నారు ఒవైసీ. ప్ర‌ధాని ప్ర‌సంగం తర్వాత ఈ ప‌రిస్థితిని ఎదుర్కోలేని తీవ్ర‌మైన‌ నిరాశ‌లో ఉన్నార‌ని చెప్పారు. వారంద‌రినీ మోడీ.. ధ‌నికుల ద‌యాదాక్షిణ్యాల‌కు వ‌దిలేశార‌ని అన్నారు. క‌నీసం పేద‌వాడి ఆక‌లిని గురించి ఆలోచించ‌కుండా లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న చేయ‌డం తీవ్ర‌మైన క్రూర‌త్వమ‌ని మండిపడ్డారు అస‌దుద్దీన్ ఒవైసీ.

అన్నీ రాష్ట్రాల బాధ్య‌తే అంటే మీరే చేస్తారు?

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నాళ్ల‌పాటు రాష్ట్రాల‌కు ఎటువంటి సాయం చేయ‌కుండా ఆదేశాలు ఇస్తూ పోతుంద‌ని ప్ర‌శ్నించారు ఒవైసీ. క‌నీసం FCI గోడౌన్స్ నుంచి అద‌న‌పు ధాన్యం కూడా రాష్ట్రాల‌కు పంప‌కుండా ప్ర‌జ‌ల ఆకలి తీర్చాలంటూ రాష్ట్రాల‌కు చెబుతూ ఉంటార‌ని నిల‌దీశారాయ‌న‌. ఆ బాద్య‌త‌ల‌న్నీ రాష్ట్రాలు చూసుకోవాలంటే ఇక కేంద్రం మ‌రేం చేస్తుంద‌ని, గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ కూర్చుంటుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.