మీ కోసమే కాదు సమాజం కోసం కూడా ఆలోచించాలె : కైలాష్ సత్యార్థి

మీ కోసమే కాదు సమాజం కోసం కూడా ఆలోచించాలె : కైలాష్ సత్యార్థి

వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ నేచర్ అండ్ ఫ్యూచర్ అంశంపై జరిగిన సభలో నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహిత కైలాష్ సత్యార్థి, ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కలెక్టర్ రాజీవ్ హన్మంత్ లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పై ప్రసంగించారు. 

కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్ట పడండి

తనకే కాదు... మీకూ నోబెల్ పురస్కారం రావాలని కైలాష్ సత్యార్థి అన్నారు. అందుకోసం కష్ట పడాలని, మీ కోసమే కాదు సమాజం కోసం కూడా ఆలోచించాలని పిలుపునిచ్చారు. కష్టపడితేనే కలలు నిజమౌతాయన్న కైలాష్... దేశం ఒక్కటే.. ప్రజలంతా ఒక్కటేనని చాటిచెప్పారు. ఉన్నతమైన కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్ట పడండని హితవు చేశారు. కుల, మతాల, ధనిక పేదలకు అతీతంగా అందరూ పాఠశాలకు వెళ్ళాలి, చదువుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్ కు హీరోలు మీరేనన్న ఆయన... మత సామరస్యాన్ని దేశ సమైక్యతను చాటండని చెప్పారు. సమాజ బాగుకోసం పని చేయండని, ఆత్మ విశ్వాసం కోల్పోవద్దన్నారు. బాల కార్మిక  వ్యవస్థను అందరం  కలిసి నిర్మూలిద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది

చిన్నారుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థి అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, గ్రామీణ ప్రాంత పిల్లల చదువు కోసం సీఎం కేసీఆర్ వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. పిల్లల హక్కులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వినోద్ కుమార్... దేశం బాగుచేయటం కోసం ఒక మంచి నాయకుడు అవసరమన్నారు. ఆ నాయకుడు మీ నుంచే ఒకొక్కరుగా ముందుకు రావాలని చెప్పారు.