
ఈ ఏడాదితో మొదలైన కొత్త దశాబ్దానికి గట్టి పునాది వేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. ఉభయ సభల్లో మంచి చర్చ జరగాలని అన్ని పార్టీలను మోడీ కోరారు. నేటి నుంచి జరిగే సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలపై ఫోకస్ ఉంటుందని చెప్పారు. ఈ దశాబ్దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడేలా ఈ బడ్జెట్ సెషన్ నడవాలని, అందుకు అన్ని పక్షాలు సహకరించాలని ఆయన కోరారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభను స్పీకర్ వాయిదా వేస్తారు. రేపు 2020-21 బడ్జెట్ ప్రసంగం ఉంటుంది.