ఈ విప్లవం.. దేశమంతా వస్తది

ఈ విప్లవం.. దేశమంతా వస్తది
  • పంజాబ్‌‌లో గెలుపుపై అర్వింద్ కేజ్రీవాల్
  • కామన్ మ్యాన్‌‌తో పెట్టుకోవద్దు.. అతడు రంగంలోకి దిగితే విప్లవమే

న్యూఢిల్లీ: ‘‘పంజాబ్ ఎన్నికల ఫలితం ఒక పెద్ద ‘ఇంక్విలాబ్ (విప్లవం)’. ఇది పంజాబ్‌‌లోని పెద్ద కుర్చీలను కదిలించింది. ముందు ఢిల్లీలో రెవల్యూషన్ మొదలైంది. ఇప్పుడు పంజాబ్‌‌లో వచ్చింది. త్వరలో దేశమంతటా వస్తుంది” అని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆప్ ఆఫీసులో పార్టీ లీడర్లు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను టెర్రరిస్టును కాదన్న విషయాన్ని ఏకపక్షంగా పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే తెలుస్తున్నదని అన్నారు. ‘‘అందరూ కలిసికట్టుగా ‘కేజ్రీవాల్ టెర్రరిస్టు’ అన్నారు. ఇప్పుడు వచ్చిన ఫలితాల ద్వారా.. ‘కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదు.. నిజమైన భారతమాత పుత్రుడు, నిజమైన దేశభక్తుడు’ అని ప్రజలే చెప్పారు. దేశాన్ని దోచుకుంటున్న మీరే ఉగ్రవాదులని అన్నారు” అని చెప్పారు. పంజాబ్ ప్రజలు అద్భుతాలు చేశారని, పంజాబ్‌‌ను తామందరం ప్రేమిస్తున్నామని అన్నారు. 

కామన్‌‌ మ్యాన్‌‌లో ఎంతో బలముంది
కామన్ మ్యాన్ (ఆమ్ ఆద్మీ) బలాన్ని ఈ ఫలితాలు తెలియజేశాయని, ప్రజలు తమ బలాన్ని తెలుసుకుని పార్టీలో చేరాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ‘కొత్త ఇండియా’ను తయారు చేసేందుకు, వ్యవస్థను, రాజకీయాలను మార్చే లక్ష్యాన్ని సాధించేందుకు చేతులుకలపాలని కోరారు. ‘‘సీఎం చరణ్‌‌జిత్ చన్నీని బధౌర్ సింగ్ నియోజకవర్గంలో ఓడించిన ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ ఉగోకె.. ఒక మొబైల్ షాపులో పని చేస్తరు. ఆయన తల్లి ఓ ప్రభుత్వ స్కూలులో శానిటేషన్ వర్కర్. తండ్రి రైతు కూలీ. కామన్ మ్యాన్‌‌లో చాలా బలం ఉంది. అందుకే నేను ఎప్పుడూ ‘ఆమ్ ఆద్మీని చాలెంజ్ చేయొద్దు.. అతడు రంగంలోకి దిగితే పెద్ద విప్లవాన్ని తీసుకురాగలడు’ అని చెబుతుంటా” అని చెప్పుకొచ్చారు.

75 ఏండ్లు వృథా చేసినం
దేశ ప్రజలు తమ బలాన్ని తెలుసుకోవాలని, పైకి ఎదగాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇది ఇంక్విలాబ్ తీసుకురావాల్సిన టైంఅని, ఇప్పటికే 75 ఏండ్లే వృథా చేశామని అన్నారు. ఢిల్లీలోని కన్నౌట్‌‌ ప్లేస్‌‌లో హనుమంతుడి ఆలయంలో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేందర్ పూజలు చేశారు.