ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గన్నేరువరం, వెలుగు: మండలంలోని గుండ్లపల్లె రాజీవ్ రహదారి స్టేజ్ నుంచి పోత్తూరు వరకు రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 15 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. గుండ్లపల్లి నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేస్తామని నాలుగేండ్ల క్రితం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​హామీ ఇచ్చి మరిచారని ప్రజలు చెబుతున్నారు. మండలానికి చెందిన గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి, పీచుపల్లి, జంగాపల్లి, హన్మాజీపల్లె పల్లి, గోపాల్ పూర్, మాదాపూర్, కాసీంపేట, పారువేల్ల, మైలారం, గన్నేరువరం, యస్వాడ, చాకలివానిపల్లె, సాంబయ్య పల్లి, చొక్కరవుపల్లె తదితర గ్రామాల ప్రజలు తమ అవసరాల కోసం గన్నేరువరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. దారిపొడవునా గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఏండ్ల  నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులకు సమస్యను విన్నవించారు. సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు డబుల్ రోడ్డు కోసం గతంలో పాదయాత్ర కూడా చేపట్టారు. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇటీవల 16 గ్రామాల ప్రజలు గన్నేరువరం నుంచి గుండ్లపల్లె వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు,  ప్రజాప్రతినిధులు స్పందించి డబుల్ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులులు కోరుతున్నారు.

అమ్మవారి దీక్ష చేపట్టిన ఎంపీ సంజయ్

కరీంనగర్ సిటీ, వెలుగు: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష చేపట్టారు. గురువారం రాత్రి పెద్ద అంబర్ పేట్ లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు భారీ బహిరంగ సభ అనంతరం ఆయన నేరుగా కరీంనగర్  వచ్చారు. శుక్రవారం ఉదయం అమ్మవార్లను దర్శించుకొని, పూజలు చేసి దీక్ష చేపట్టారు. సమస్త హిందూ మానవాళి, సమాజ శ్రేయస్సు కోసం తాను ఏటా దీక్ష తీసుకుంటున్నట్టు ఎంపీ చెప్పారు. 

ఆడబిడ్డలకు కానుక బతుకమ్మ చీరలు

గంగాధర, వెలుగు : ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు దసరా కానుక అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల మహిళలకు ఎంపీడీఓ ఆఫీస్​లో శుక్రవారం ఆయన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు ప్రభుత్వాలు బతుకమ్మను పట్టించుకోలదని, టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజగోపాల్​రెడ్డి, జడ్పీటీసీ అనూరాధ, పీఏసీఎస్​ల చైర్మన్లు తిర్మల్​రావు, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్.. మరో అంబేద్కర్ 

చొప్పదండి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితుల కోసం సీఎం కేసీఆర్​దళితబంధు పథకం ప్రవేశపెట్టి నవ శకానికి మరో అంబేద్కర్​గా నిలిచారని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం కొనేరుపల్లి గ్రామానికి మంజూరైన దళిత బంధు యూనిట్లను శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దళితబంధు ఇస్తున్న కేసీఆర్ నిజమని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షల వేస్తామని చెప్పిన మోడీ అబద్ధమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్, జడ్పీటీసీ సౌజన్య, మాజీ గ్రంధాలయ చైర్మన్​ రవీందర్​రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.   

సమస్య ఎక్కడున్నా పరిష్కరించాలి

ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలి
  
సిరిసిల్ల  కలెక్టరేట్,వెలుగు
: జిల్లాలో సమస్యలు ఎక్కడున్నా ఆఫీసర్లు వెంటనే స్పందించాలని జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో జెడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. శాఖా పరంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

సమస్యల పరిష్కారానికి కృషి..

 వేములవాడ నియోజకవర్గంలో మిడ్​మానేరు జలాశయ ముంపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రమేశ్​బాబు అన్నారు. సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ.29 కోట్ల పెండింగ్ పరిహారం మంజూరు చేయడం అభినందనీయం అన్నారు. ముంపు బాధితులు 200 మందికి పట్టాలివ్వడం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 172 పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో తెలంగాణ పవర్​లూం జౌళి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వేణు, జెడ్పీటీసీలు,ఆఫీసర్లు పాల్గొన్నారు. 

అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీలు తెరిపిస్తం 

మెట్ పల్లి, వెలుగు : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శుక్రవారం మెట్ పల్లిలో నిర్వహించిన ప్రజా గోస.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో భాగంగా పాత బస్టాండ్ వద్ద రోడ్ షో లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నిజాం ఫ్యాక్టరీలు తెరవకుంటే ఫ్యాక్టరీ గేటుకు ఉరేసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎటు పోయారని ప్రశ్నించారు. మోడీ సర్కారు అధికారంలోకి రాగానే ఎక్కడా హిందూ ముస్లిం ఘర్షణలు జరగలేదని, తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మత ఘర్షణలకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పీఎఫ్ఐ ఉగ్రదాడుల కోసం యువతకు ట్రైనింగ్ ఇస్తున్నా సర్కారు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రమేశ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లవ్వకు ఇల్లిచ్చిండ్రు

కేటీఆర్​ హామీ ఇచ్చిన మరుసటి రోజే పనులు ప్రారంభం

కోనరావుపేట,వెలుగు: మండలంలోని బావుసాయి పేట గ్రామానికి చెందిన ఎల్లవ్వకు డబుల్ బెడ్ రూం మంజూరైంది. మినిస్టర్ కేటీఆర్​చెప్పిన మరుసటిరోజే అధికారులు ఇంటి పనులు ప్రారంభించారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన మినిస్టర్​కేటీఆర్​ను ఎల్లవ్వ కలెక్టరేట్​లో కలిసింది.  భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడని, బిడ్డతో బతుకు భారంగా గుడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గూడు సౌకర్యం కల్పించాలని వేడుకుండి. దీంతో మంత్రి కేటీఆర్ ఎల్లవ్వకు డబుల్ బెడ్ రూం నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు. దీంతో కలెక్టర్​శుక్రవారం బావుసాయిపేటలో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ బాధ్యులు టి.శ్రీనివాస్ రావు, ప్యాకేజీ 9 కార్యనిర్వహక ఇంజనీర్​శ్రీనివాస్ లు దగ్గరుండి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ప్రారంభమైన ఫొటోలను చూసిన మినిస్టర్​ట్విట్టర్ వేదికగా  కలెక్టర్ ను ‘వెల్ డన్ అనురాగ్..’ అంటూ అభినందించారు.

అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి

కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లాలో అంటరానితనం, అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్  మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2015 నుంచి 2022 వరకు అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరగకూడదన్నారు. జిల్లా న్యాయస్థానాలలో, పోలీసులతోపాటు వివిధ శాఖల వద్దఉన్న పెండింగ్ కేసుల వివరాలను గురించి  తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, అడిషనల్ సీపీ శ్రీనివాస్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియెల్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గంగారాం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.