ఈ గుర్తు ఒక హెచ్చరిక!

ఈ గుర్తు ఒక  హెచ్చరిక!

ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా సరే… చుట్టూ ఒకసారి గమనించండి. ఎక్కువగా ఏం కనిపిస్తోంది? ప్లాస్టిక్ కదా! సిటీల్లో, మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లోనే కాదు, ఎవరూ కనిపించని ప్రదేశాల్లోకి కూడా మన ఫోన్ రూపంలోనో, వాటర్ బాటిల్, ఇయర్ ఫోన్, పర్స్, కళ్ళజోడు.. ఇలా ఏదో ఒక చిన్న ప్లాస్టిక్​ వస్తువు మనతో ఉండే తీరుతుంది. అంతగా మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది ప్లాస్టిక్.

నేచర్​కి ప్రమాదమని, మన ఆరోగ్యానికీ ప్లాస్టిక్ చెడు చేస్తుందని తెలిసినా… ప్లాస్టిక్ లేకుండా మనిషి బతకటం చాలా కష్టమనేది మాత్రం నిజం. కత్తి ప్రమాదకరమైందే… కానీ, దాన్ని కూడా జాగ్రత్తగా వాడుకుంటాం కదా. అలాగే ప్లాస్టిక్​ని కూడా వాడాల్సిన విధంగా వాడకపోతేనే ప్రమాదం. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లు, ఇతర పరికరాలపై అది ఏ రకం ప్లాస్టిక్ అనేది చెప్పాలనే రూల్ ఒకటి ఉంది. ఏ రకం ప్లాస్టిక్ మళ్లీ మళ్లీ వాడాలి. దేన్ని వాడిన తరువాత పడేయాలి అనే విషయంు ఆయా ప్రొడక్ట్​ల మీద రాసి ఉంటుంది. కొద్దిగా టైం ఇచ్చి అది తెలుసుకుంటే ప్లాస్టిక్ ప్రమాదాన్ని చాలా వరకూ తగ్గించవచ్చు.

పాలీ ఇథిలీన్ టెరిప్తలేట్

మనం రెగ్యులర్​గా, ఎక్కువగా వాడే ప్లాస్టిక్ ఇదే. కానీ దీని వల్లనే ఎక్కువ ప్రమాదం ఉందన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. దీనిని యారో మార్కులతో ఉండే ట్రయాంగిల్​లో నెంబర్ 1తో సూచిస్తారు. మంచినీళ్లకు వాడే, కూల్ డ్రింక్​, జ్యూస్ వంటివి నింపే బాటిల్స్, హోటల్స్​లో ఫుడ్ ప్యాక్ చేసే బాక్స్​ల వంటి వాటిల్లో ఈ ప్లాస్టిక్ వాడతారు. తక్కువ బరువు, ఫ్లెక్సిబుల్ గా ఉండటం, లీకేజ్ అవకుండా బలంగా ఉండటం వల్ల ఈ ప్లాస్టిక్ వాడతాం. ఈ ప్లాస్టిక్ కేవలం ఒకసారి వాడటానికి మాత్రమే. ఈ వస్తువులని మళ్లీ మళ్లీ వాడడం ప్రమాదకరం. ఈ ప్లాస్టిక్ తయారీలో యాంటిమొని ట్రయాక్సైడ్, యాంటిమొనిలాంటి కెమికల్స్ వాడుతారు. మామూలు టెంపరేచర్​ కంటే ఏ మాత్రం ఎక్కువ వేడిగా ఉన్నా. ఈ ప్లాస్టిక్ లోని యాంటిమొని కరిగి ఫుడ్, నీళ్లలో కలుస్తుంది. అంటే ఇలాంటి బాటిల్స్, బాక్సుల్లో వేడిగా ఉండే ఫుడ్, డ్రింక్స్ ప్యాక్ చెయ్యొద్దు.

పాలీ వినైల్ క్లోరైడ్
చాలా ప్రమాదకరమైన ప్లాస్టిక్​లలో ఇదీ ఒకటి. దీనిని బాణాల త్రిభుజంలో 3 నెంబర్​తో సూచిస్తారు. ఈ ప్లాస్టిక్ వినియోగం దగ్గరి నుంచి రీసైక్లింగ్, డిస్పోజల్ వరకు అంతా విషపూరితమే. ఇది మెత్తగా, ఎక్కువ ఫ్లెక్సిబుల్​గా ఉండే ప్లాస్టిక్. ప్రొడక్టివిటీ కాస్ట్ తక్కువగా, మన అవసరానికి తగ్గట్టు డిజైన్ చేసుకోగలగటం వల్ల ఈ తరహా ప్లాస్టిక్ ఎక్కువ వాడతారు. వినైల్ క్లోరైడ్​కి అవసరాన్ని బట్టి మెత్తగా, పెళుసుగా, నున్నగా ఉండేందుకు ఎన్నో కెమికల్స్ కలుపుతారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. మెత్తని ఆట బొమ్మలు, ప్యాకేజింగ్, టూత్​పేస్టులు, షేవింగ్​, ఫేస్​ క్రీముల వంటివి, వైర్లు, కేబుళ్ల ఇన్సులేషన్​గా వాడతారు. ఇక గట్టి ప్లాస్టిక్​ను ఎలక్ట్రిక్ పరికరాలు, క్రెడిట్ కార్డులు, పైపుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్​లో మెత్తదనం కోసం కలిపే కెమికల్స్​ శరీరంలో హార్మోన్ల మీద ప్రభావం చూపుతాయి. ఆస్తమాకు, అలర్జీలకు కారణమవుతాయి. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్, పిల్లల్లో ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పిల్లలకి బొమ్మలు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి.

లో డెన్సిటీ పాలీ ఇథిలీన్
ఇది 4 నెంబర్ సింబల్​తో ఉంటుంది. మెత్తగా, ఫ్లెక్సిబుల్​గా ఉంటుంది. అన్ని రకాల ప్లాస్టిక్​లతో పోలిస్తే. సన్నగా, వీలైనంతగా వంచగలిగేలా ఈ తరహా ప్లాస్టిక్ తయారు చేయవచ్చు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే డబ్బాలు, మూతలు, వేడి, చల్లని పానియాలను తాగేందుకు ఉపయోగించే కప్పులు, సాస్, కెచప్ బాటిళ్లు, బ్యాగులు లాంటి వాటికి ఇది వాడతారు. ఫుడ్ ప్యాక్ చేయటానికి ఈ ప్లాస్టిక్ అన్నిటికన్నా బెటర్. అయితే ఈ ప్లాస్టిక్​తో ప్రమాదం చాలా తక్కువే. కానీ, బాగా వేడిగా ఉండే పదార్థాలని ఉంచినా, యూ వీ రేస్​కి ఎక్స్​పోజ్​ అయినా దీనిలోంచి నోనైల్ ఫినాల్ విడుదలై తినేవాటిలో కలిసిపోతుంది.

పాలీ ప్రొపిలీన్ ప్లాస్టిక్
పెద్దగా ప్రమాదం ఉండని ప్లాస్టిక్ ఇదే. దృఢంగా ఉండడంతోపాటు తేలికగా ఉండడమే కాకుండా, ఎక్కువ వేడిని కూడా తట్టుకోగలదు. అంటే వేడిగా ఉండే ఫుడ్, డ్రింక్స్ ఉంచడానికి పాలీ ప్రొపిలీన్ కంటెయినర్లు మాత్రమే వాడొచ్చు. మెడికల్ ఎక్విప్​మెంట్స్ కంటెయినర్లు, స్ట్రాలు, బాటిళ్ల మూతలు, పాల బాటిళ్లు, డిస్పోజబుల్ డైపర్లు, శానిటరీ ప్యాడ్ లైనర్లు, కార్లు, మనం వాడే ఫోన్లలో ప్లాస్టిక్ భాగాలు లాంటివి ఈ ప్లాస్టిక్​తోనే తయారవుతాయి. ఈ ప్లాస్టిక్​తో ప్రమాదం దాదాపు లేనట్లే. అందుకని ఆహార పదార్థాలను, నీటిని నిల్వ చేసుకునేందుకు ఈ ప్లాస్టిక్​ను వాడొచ్చు.

పాలీస్టైరిన్

ఇది ప్రమాదకరమైన ప్లాస్టిక్. ఇది ఎంత మాత్రం రీ యూజబుల్ కాదు. స్టైరో ఫోమ్ ప్లేట్లు, కప్పులు, చెంచాలు, ఫోర్కులు వంటి వస్తువులు, సీడీ, డీవీడీలు, హ్యాంగర్లు, హెల్మెట్లు, టెస్ట్ ట్యూబులు, ఫోమ్ ప్యాకేజింగ్, కోడిగుడ్లను ఉంచే ఫోమ్ ట్రేలు, ట్రాన్స్ పోర్ట్ ప్యాకేజింగ్​లో ఈ ప్లాస్టిక్ వాడతాం. ఇవి వాడడం వల్ల న్యూరో, మెదడు సమస్యలు, లివర్, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అంతే కాదు మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్​ని కూడా ఇది దెబ్బ తీస్తుంది. ఇందులో ఉండే స్టైరిన్ అనే కెమికల్ సిగరెట్లు, వెహికిల్స్ నుంచి వచ్చే పొగలోనూ ఉంటుంది. అంటే ఇది ఎంత ప్రమాదకరమో చెప్పక్కరలేదు.

ఇంకా కొన్ని…
పాలీ కార్బొనేట్, లెక్సన్ సహా ఇతర రకాల ప్లాస్టిక్​లు. 7వ నంబర్ కిందకి వస్తాయి. ఈ గ్రూపులో వందల రకాల ప్లాస్టిక్​లు ఉంటాయి. కొన్ని రకాల వాటర్ బాటిళ్లు, ఫుడ్ నిల్వ బాక్సులు, వాటర్ కంటెయినర్లు, పళ్ల రసాలు, కెచప్ బాటిళ్లు, సీడీలు, బ్లూరే డిస్కులు, హోంఅప్లయెన్సెస్​, కార్లలోని ప్లాస్టిక్ భాగాలు, కంప్యూటర్లు, పవర్ టూల్స్​లో, ఇతర చాలా రకాల అవసరాలకు 7వ కేటగిరీ ప్లాస్టిక్ వాడతారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ… యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు.

ఏ తరహా ప్లాస్టిక్ అయినా సరే వేడికి గురైతే.. అది కరిగి ప్రమాదకర కెమికల్స్​ విడుదలవుతాయి. అందువల్ల వేడి ఆహారాన్ని నిల్వ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, ప్యాకెట్లను వాడకపోవటమే మంచిది. రీ యూజబుల్ ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలు అయినా రెగ్యులర్ గా శుభ్రం చేయాల్సిందే. లేకుంటే… బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరిగి రోగాలకు కారణమవుతాయి. అయితే వీటిని కూడా మరీ వేడిగా ఉండే నీళ్లలో కడగ కూడదు. వస్తువులను వెనిగర్ లేదా యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ తో శుభ్రం చేయడం మంచిది. ఏది రీ యూజబుల్? ఏది యూజ్ అండ్ త్రో? అని ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ మీద ప్రింట్ చేయడం తప్పనిసరి. కానీ బ్రాండెడ్ కంపెనీలు తప్ప మామూలుగా వీటిని తయారు చేస్తున్న ఏ చిన్న కంపెనీ ఈ రూల్ ని పాటించటం లేదు. అందుకే ఈ సింబల్ లేని బాటిల్స్, కంటెయినర్స్ వాడకపోవటమే మంచిది.

ఈ గుర్తుని నోటీస్ చేశారా?

ఏ ప్లాస్టిక్ వస్తువుని ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ వాడొచ్చు? ఎన్నిసార్లు రీసైకిల్ చెయ్యొచ్చు? అని దాని మీదనే ఉంటుంది. అది గమనించి వాడుకుంటే చాలావరకు చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఒకదానివైపు మరొకటి వంగి త్రిభుజాకారంలో ఉన్న బాణాలతో కూడిన ఈ గుర్తు మధ్యలో అది ఏ రకం ప్లాస్టిక్ అన్నది నెంబర్​తో ప్రింట్ చేస్తారు.
ఆ నెంబర్స్, సింబల్స్ ఇలా ఉంటాయి.

PETE 1 (పాలీ ఇథిలీన్ టెరిప్తలేట్)
HDPE 2 (హై డెన్సిటీ పాలీ ఇథిలీన్)
PVC 3 (పాలీ వినైల్ క్లోరైడ్)
LDPE 4 (లో డెన్సిటీ పాలీ ఇథిలీన్)
PP 5 (పాలీ ప్రొపైలిన్)
PS 6 (పాలీ స్టైరిన్)
Other (బీపీఏ, పాలీ కార్బొనేట్, లెక్సాన్ వంటి ఇతర ప్లాస్టిక్ రకాలు)

మామూలుగా ప్లాస్టిక్​ వస్తువులని తయారు చేసేటప్పుడే రంగులు, గట్టితనం, డిజైన్ వంటి వాటి కోసం ప్లాస్టిక్​తో పాటు వివిధ రకాల కెమికల్స్​ కలుపుతుంటాయి. ఫుడ్, వాటర్ కోసం ప్రత్యేకంగా తయారయ్యే వస్తువులు తప్ప మిగతా వాటిల్లో.. పెట్రోలియం బై ప్రొడక్ట్స్ వాడతారు. అంటే పైన చెప్పుకున్న వాటిల్లో 1, 3, 6 రకాలతో పాటు 7వ రకంలోని పాలీకార్బొనేట్ ప్లాస్టిక్​లు ప్రమాదకరమైనవి. 2, 4, 5 రకం ప్లాస్టిక్​లు మాత్రం కొంత బెటర్.

హై డెన్సిటీ పాలీ ఇథైలీన్
ఇది కొంచెం గట్టిగా ఉండే ప్లాస్టిక్ అంటే నెంబర్ 2 అన్నమాట. వంట నూనెల క్యాన్లు, షాంపూలు, డిటర్జెంట్లు వంటి వాటి బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగులు, వాటర్ జగ్గులు, బకెట్లు, కుర్చీలు వంటి వాటిని తయారు చేయడానికి ఈ రకం ప్లాస్టిక్ వాడతారు. దీని తయారీ, రీసైకిల్ చేయడం ఈజీ కావటం వల్ల ఇది కొంచెం బెటర్. ఇది ట్రాన్​స్పరెంట్​గా ఉండదు. కొంత వరకూ వేడిని కూడా తట్టుకుంటుంది. అయితే ఎక్కువగా రీ సైకిల్ చేస్తారు కాబట్టి ఆహార పదార్థాల ప్యాకేజింగ్​లో వాడరు. చాలా వరకు మనం క్యారీ బ్యాగులుగా వాడే మందపాటి కవర్లు కూడా ఈ రకం ప్లాస్టిక్​తోనే తయారవుతాయి. అయితే అవి చాలా పలుచగా ఉండడం వల్ల, వేడికి త్వరగా ఎఫెక్ట్​ అవుతాయి. వాటిలో వేడిగా ఆహార పదార్థాలను ఉంచితే.. నొనైల్ ఫినాల్ అనే రసాయనం కలిసే ప్రమాదం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి