V6 News

మహిళా ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు, ఒక నెల పితృత్వ సెలవులు

మహిళా ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు, ఒక నెల పితృత్వ సెలవులు

తమ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు, ఒక నెల పితృత్వ సెలవులు ఇస్తుందని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌సిఎస్‌ఓఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ఉద్యోగులకు ప్రయోజనం కల్పించేందుకు సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను, కుటుంబాలను మరింత మెరుగ్గా చూసుకోవడానికి దోహదపడుతుందని ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. అధికారులు రాష్ట్ర పరిపాలనకు బ్యాక్ బోన్(వెన్నెముక) అని, సిక్కిం ప్రజల అభివృద్ధికి వారు గణనీయంగా దోహదపడుతున్నారని తమాంగ్ చెప్పారు. సివిల్ సర్వీసెస్ అధికారులకు పదోన్నతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడంపై గణనీయమైన దృష్టి సారించామన్న ఆయన.. దీనివల్ల పదోన్నతుల సంఖ్య పెరుగుతుందన్నారు.

కొత్త IAS, SCS (సిక్కిం సివిల్ సర్వీసెస్) అధికారులందరినీ సిక్కిం సీఎం తమాంగ్ ఈ సందర్భంగా అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే  సాధారణంగా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళకు 6 నెలలు లేదా 26 వారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఉంటుంది. కానీ సిక్కి సీఎం చేసిన ప్రకటన ప్రకారం ఆ రాష్ట్ర మహిళా ఉద్యోగులు 56వారాల ప్రసూతి సెలవులు పొందనున్నారు.