యాసంగికి బోర్లు, బావులే దిక్కు.. సాగర్ ఆయకట్టుకు ఈసారి క్రాప్ హాలిడే!

యాసంగికి బోర్లు, బావులే దిక్కు.. సాగర్ ఆయకట్టుకు ఈసారి క్రాప్ హాలిడే!
  •     ప్రాజెక్టులో అడుగంటిన జలాలు
  •     రిజర్వాయర్లలోని నీళ్లు తాగునీటికి మాత్రమే 
  •     ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో రైతులు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి యాసంగికి బోర్లు, బావులే దిక్కుకానున్నాయి. సాగర్ ఆయకట్టుకు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజీకి చేరడంతో ఆఫీసర్లు యాసంగి సాగుకు నీరు ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎడమ కాల్వ కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో ఖమ్మం జిల్లాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో రైతులు ప్రత్యామ్నాయాలపై నజర్ పెట్టారు. కొందరు బోర్లు వేయిస్తున్నారు. రైతులు వరి సాగు చేసి నష్టపోవద్దన్న ఆలోచనతో అధికారులు ముందస్తు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నీళ్లున్న రైతులు ఆరు తడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచిస్తున్నారు.

వానాకాలమే ఇబ్బంది పడ్డరు.. 

ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 17 మండలాలున్నాయి. వర్షాకాలంలో పెద్దగా వర్షాలు పడకపోవడం, ప్రాజెక్టుల నుంచి నీటిని వదలకపోవడంతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ముందు రైతుల పరిస్థితిని గమనించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో మూడు విడతలుగా నీటిని విడుదల చేశారు.

ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినాఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో దాదాపు 5 టీఎంసీల నీటిని కాల్వలకు వదిలారు. దీంతో పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులకు ఉపశమనం లభించింది. ఇప్పుడు సాగర్ లో డెడ్ స్టోరేజీకి చేరగడంతో యాసంగికి నీళ్లు విడుదల ఉండబోదని అధికారులు ముందుగానే ప్రకటించారు. రైతులు నార్లు పోసుకొని ఇబ్బంది పడొద్దని చెబుతున్నారు. యాసంగిలో సాధారణంగా రెండున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారు. ఈసారి లక్ష ఎకరాల్లోపే సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మిగతా రిజర్వాయర్లదీ అదే పరిస్థితి..

జిల్లాలో ప్రధానమైన పాలేరు, వైరా రిజర్వాయర్లలో ప్రస్తుతం నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి ఉంది. వాటిని కేవలం తాగునీటి కోసమే కేటాయించారు. పాలేరు రిజర్వాయర్ లో 2.558 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 1.913 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వైరా రిజర్వాయర్ లో 14.7 అడుగుల మేర నీళ్లున్నాయి. ఈ రెండు రిజర్వాయర్లలో నీటినే మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు సప్లయ్​ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీరు వేసవి తాగునీటి అవసరాలకు కూడా సరిపోదని, జూన్ నాటికి ఇంకా 10 టీఎంసీల నీరు తాగునీటికే అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.  

బోరు వేసుకున్నా పడావ్​ తప్పట్లే.. 

నాకు ఆరెకరాల భూమి ఉంది. సాగర్ నీళ్లు సరిగా రాకపోవడంతో వానాకాలంలోనే ఇబ్బంది పడ్డ. మళ్లీ ఆ పరిస్థితి రావొద్దని వారం కిందట నా పొలంలో బోరు వేయించిన. అది మూడెకరాలకే సరిపోతది. సాగర్ నీళ్లు రాకపోతే మరో మూడెకరాలు పడావ్ పెట్టాల్సిందే.. 
- జనార్ధన్ రెడ్డి, రైతు, కూసుమంచి