ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో 30 ఏళ్ల తర్వాత మొదటిసారి ఒక చిన్నారి జన్మించిన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశం యూరప్ ఖండంలోని ఇటలీ దేశంలో అబ్రుజ్జో అనే ప్రాంతంలో ఉన్న పాగ్లియారా డీ మార్సి అనే చిన్న గ్రామం.
ఈ గ్రామంలో మనుషుల కంటే పిల్లుల సంఖ్యే ఎక్కువ. ఇక్కడ కేవలం 20 మంది మాత్రమే నివసిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ ఒక్క బిడ్డ కూడా జన్మించలేదు. కానీ కొద్దిరోజుల క్రితం లారా బుస్సీ ట్రాబుక్కో అనే పాప పుట్టడంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పాప నామకరణానికి ఊరంతా వచ్చారు.
ఇటలీలో జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో ప్రభుత్వం పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేస్తోంది. లారా తల్లిదండ్రులకు 1,000 యూరోలు అంటే సుమారు రూ.90వేలు బేబీ బోనస్‌గా, అలాగే నెలకు కొంత మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
►ALSO READ | బహ్రెయిన్ లీగ్ వివాదం: భారత్ తరపున ఆడి అడ్డంగా బుక్కైన పాక్ కబడ్డీ ప్లేయర్!
ఇటలీలో జనాభా సంక్షోభం తీవ్రంగా ఉండడానికి కారణాలు చూస్తే యువత ఉద్యోగాల కోసం వేరే నగరాలకు వెళ్లిపోవడం, సరైన ఉద్యోగ భద్రత లేకపోవడం ఇంకా పిల్లల పెంపకానికి అవసరమైన డే-కేర్ సెంటర్లు, స్కూల్స్ అందుబాటులో లేకపోవడం, పన్నులు ఎక్కువగా ఉన్నా దానికి తగ్గట్టుగా సామాజిక సౌకర్యాలు లేకపోవడం.
ప్రస్తతం లారా తల్లిదండ్రులు కూడా ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా స్కూళ్లు లేవు. పక్క ఊరికి వెళ్లి చదువుకోవాలన్నా అక్కడ కూడా పిల్లలు లేక స్కూళ్లు మూతపడుతున్నాయి. కేవలం డబ్బులు ఇస్తే సరిపోదని యువతకు మంచి ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే ఈ పరిస్థితి మారుతుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఈ గ్రామం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు, ప్రశాంతత కోరుకునే పర్యాటకులకు ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుతోంది.
