బెల్టు షాపులు వద్దన్నందుకు దళితులపై చోరీ కేసు

బెల్టు షాపులు వద్దన్నందుకు దళితులపై చోరీ కేసు
  • సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి
  • 19 మంది దళితులపై చోరీ కేసు
  • నలుగురు మహిళలు సహా 13 మంది అరెస్టు
  • బాధితులను విడుదల చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన
  • గ్రామంలో మద్యానికి బానిసై మూడు నెలల్లో ఐదుగురు మృతి


సంగారెడ్డి, వెలుగు: బెల్టు షాపులు వద్దన్నందుకు, అక్రమ లిక్కర్​ సీసాలను పగులగొట్టి నిరసన తెలిపినందుకు ఓ ఊర్లో దళితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెల్టు షాపులపై చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎదురు కేసులు పెట్టారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో కొనసాగుతున్న బెల్టుషాపుల కారణంగా మద్యానికి బానిసై మూడు నెలల్లో ఐదుగురు చనిపోయారు. వరుస ఘటనలతో కోపోద్రిక్తులైన ఊరోళ్లు ఈ నెల 18న బెల్టు షాపులపై దాడి చేశారు. మద్యం సీసాలను పగులగొట్టారు. దాడి జరిగిన రెండు రోజులకు 19 మంది దళితులపై పోలీసులు చోరీ కేసులు పెట్టారు. ఇందులో నలుగురు మహిళలు సహా 13 మందిని అరెస్టు చేసి.. అదే రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించగా.. సంగారెడ్డి జైలుకు తరలించారు. 

అక్రమ లిక్కర్​ సీసాలు పగులగొడ్తే కేసులేంది?

గ్రామాల్లో బెల్టు షాపులు నడవకుండా చూడాల్సిన పోలీసులు.. వాటి నిర్వాహకులకు అండగా ఉంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. బెల్టుషాపులను తీసేయాలని ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, అక్రమంగా అమ్ముతున్న లిక్కర్ సీసాలు పగులగొడితే కేసులు పెట్టి అరెస్టు చేసుడేందని దళిత సంఘాలు  ప్రశ్నిస్తున్నాయి. దళితులపై కేసులను నిరసిస్తూ కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.  

మద్యానికి బానిసై మూడునెలల్లో ఐదుగురు మృతి

మూడు నెలల్లో మద్యం కారణంగా మారేపల్లికి చెందిన మాణిక్యం (26), అశోక్ (55), నర్సింలు(35), నవీన్ (25), ఆయూబ్ పాషా (30) మృతి చెందారు. ఇందులో నవీన్ (25).. ఈ నెల 17న లిక్కర్ కు తల్లి పైసలియ్యలేదని సూసైడ్  చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులు బెల్టు షాపులను ఎత్తేయాలని డిమాండ్​ చేస్తూ.. ఈ నెల 18న ఆందోళనకు దిగారు. బెల్టు షాపులపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు 19 మంది దళితులపై దొంగతనం కేసులు పెట్టారు. వీరిలో 13 మందిని ఈ నెల 20న కౌన్సెలింగ్ పేరుతో పోలీస్​స్టేషన్ కు పిలిపించి..  జైలుకు పంపించారని స్థానికులు అన్నారు. పరారీలో ఉన్నట్లు చెప్తున్న మిగతా ఆరుగురిలో ఓ అంధురాలు ఉందని, ముగ్గురికి కరోనా పాజిటివ్​ వచ్చిందని పేర్కొన్నారు. జైలుకు వెళ్లిన వారిలో చిన్న బిడ్డలున్న మహిళలు కూడా ఉన్నారని తెలిపారు.  

మారేపల్లిలో 6 బెల్టు షాపులు

మారేపల్లి గ్రామంలో 3 వేల జనాభా ఉంది. ఇక్కడ 6 బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. వాటిపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేదు. బెల్టు షాపులపై దాడులు చేసిన తెల్లారే (ఈ నెల 19న) ఊర్ల బెల్టుషాపులు ఉండొద్దంటూ తీర్మానం కూడా చేశారు. బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 22న మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. తామిచ్చిన ఏ కంప్లెయింట్​ను కూడా పట్టించుకోకుండా తమపైనే  పోలీసులు ఎదురు కేసులు పెడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఎదిరిస్తే పీడీ యాక్ట్ పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన దళితులను విడిచి పెట్టాలని 
డిమాండ్​ చేస్తున్నారు. 

బెల్టు షాపులు లేవంటున్న ఎక్సైజ్​ ఆఫీసర్లు

మారేపల్లిలో బెల్టు షాపులు లేనే లేవని ఎక్సైజ్ ఆఫీసర్లు అంటున్నారు. కొందరు కిరాణా షాపుల ముసుగులో బెల్టుషాపులు నడిపిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని తాము ఎన్ని సార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. బెల్టు షాపులు లేకుంటే.. పగిలిన మద్యం సీసాలు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు.