పడగ విప్పుతున్నపాములు

పడగ విప్పుతున్నపాములు
  • ప్రపంచంలో ​ఇండియాలోనే ఎక్కువ
  • పల్లెల్లో డాక్టర్లు,ఆస్పత్రుల కొరత
  • యాంటీ వెనమ్ ​లేకపోవడం ప్రధాన కారణం
  • మూఢనమ్మకాలతోనూ గాలిలో కలుస్తున్న ప్రాణాలు

వానాకాలం వస్తే పాములకు పండుగే. ఈ కాలంలో అవి హాయిగా తిరుగుతాయి. కావాల్సినంత ఫుడ్డు దొరుకుతుంది. స్వేచ్ఛగా తిరిగేటందుకు ఎక్కడ చూసినా పొదలే ఉంటాయి. చాలాజాతుల పాములు వానాకాలంలోనే జతకట్టి, సంతానం కూడా పెంచుకుంటాయి. కానీ.. వానల చాటున మనుషులకు మాత్రం పాముల ముప్పు పొంచి ఉంది. వానలు పడినప్పుడల్లా వాటి పుట్టలు, కలుగులు నీళ్లతో నిండుతాయి. పాములు కాస్త నీళ్లులేని పొడి ప్రదేశం కోసం బయలుదేరతాయి. మనుషులు ఎదురయ్యేసరికి భయంతో టపీమని కాటువేసి పోతాయి. మనుషులు మాత్రం సగం విషంతో, మరో సగం భయంతో వణికిపోయి ప్రాణాలొదిలేస్తున్నారు. ఇలా పాము కాటుతో మరణిస్తున్నవారి సంఖ్య ఇండియాలోనే అత్యధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియా.. పాము కాట్ల రాజధాని​

పాముకాటు సంఘటనల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఇండియా. కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, 2017 ఏప్రిల్​ నుంచి అక్టోబరు మధ్య దేశ వ్యాప్తంగా 1.14 లక్షల పాము కాటు​కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 24,437 కేసులు రిజిస్టర్​అయ్యాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్నాటక రాష్ట్రాల్లో పాముకాట్లు ఎక్కువగా సంభవించాయి. అయితే, అధికారికంగా నమోదు అయ్యే కేసులు చాలా  తక్కువని, అధికారుల దృష్టికి రాని పాముకాటు కేసులు, మరణాలు ఎన్నో ఉంటాయని హెర్పెటాలజిస్టులు, డాక్టర్లు, సైన్స్ ​ఎకాలజీ  నిపుణులు చెబుతున్నారు. అందుకే.. పాముకాట్ల​ను డబ్ల్యూహెచ్​ఓ ‘నెగ్లెక్టెడ్ ​ట్రాపికల్ ​డిసీజ్’గా ప్రకటించిందని వారు గుర్తుచేస్తున్నారు.

అధికారిక లెక్కలు చాలా తక్కువ

ఏటా వానాకాలం వస్తే చాలు.. పాము కాటుకు సంబంధించిన ఫోన్లు తనకు తరచూ వస్తుంటాయని మహారాష్ట్రకు చెందిన అడిషనల్​ ప్రిన్సిపల్ ​చీఫ్​ కన్సర్వేటర్​ సునీల్ ​లిమాయే అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 70ఫోన్లు వచ్చినట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా జూన్​ నుంచి సెప్టెంబరు మధ్యలో రోజూ కనీసం రెండు పాముకాటు కేసులైనా  తన దృష్టికి వస్తుంటాయన్నారు. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, భారతదేశంలో 2005లో 45,900 పాముకాటు సంఘటనలు జరిగాయి. అధికారిక లెక్కల కంటే ఇది 30 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అలాగే, సెంటర్​ ఫర్ ​గ్లోబల్ ​హెల్త్​ రీసెర్చ్​ అనే సంస్థ 2011లో నిర్వహించిన మిలియన్ ​డెత్ స్టడీలో కూడా దాదాపుగా ఇవే అంచనాలు నమోదయ్యాయి. నేషనల్ ​క్రైమ్ ​రికార్డ్స్ ​బ్యూరో ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా పాముకాటు వల్ల 8,554 మరణాలు మాత్రమే సంభవించాయని పేర్కొంది. స్నేక్​బైట్​ ఇంటరెస్ట్ ​గ్రూప్​అనే వాట్సాప్​ గ్రూపులో దేశంలోని 14 రాష్ట్రాలు, నేపాల్‌కు చెందిన 257 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా కలిసి 2015లో పాముకాటుకు గురైన 3,500 మంది ప్రాణాలను కాపాడారు.

100 నిమిషాల్లోపు వస్తే సేఫ్​

గుజరాత్​లోని భావ్​నగర్​కు చెందిన పదేళ్ల మనన్​వోరాకు పాము కరిచిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ యాంటీ- వీనమ్ (విషానికి విరుగుడు) ​లేకపోవడంతో దానికి బదులుగా యాంటీ బయోటిక్​ఇంజెక్షన్ ​ఇచ్చి, 17 కిలోమీటర్ల దూరంలోని మరో ఆస్పత్రికి పోవాలంటూ సూచించారు. ఇలాంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా మారిపోయాయి. ఎందుకంటే అక్కడ సరైన మౌలిక వసతులు, ఆస్పత్రులు, డాక్టర్లు లేకపోవడమే. అయితే, పాము కరిచిన 100 నిమిషాల్లోపు 100 ఎంఎల్​ యాంటీ- వీనమ్​ఇస్తే ప్రాణాలను కాపాడొచ్చని, అందుకే పాముకాటు బాధితులు తమ దగ్గరికి వచ్చినా ఆస్పత్రులకే పంపాలని మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన డాక్టర్ ​దిలీప్​ పాండే విజ్ఞప్తి చేశారు. సుమారుగా 7 వేల పాముకాటు బాధితులకు ట్రీట్‌మెంట్‌ చేసిన రికార్డు ఆయనది.

పాముకాటు మరణాలు ఇండియాలోనే ఎందుకు ఎక్కువ?

  •             మన ఊర్లలో పాముకాటుకు విరుగుడు మందిచ్చే ఆస్పత్రులు తక్కువ. 
  •             సరైన రోడ్లు, వాహనాలు లేక చికిత్స కోసం టైంకు ఆస్పత్రులకు చేరుకోలేకపోతున్నారు.
  •             పాము కాటుకు చికిత్స చేయడంలో గ్రామాల్లోని వైద్య సిబ్బందికి సరైన పరిజ్ఞానం ఉండటం లేదు.
  •             మూఢనమ్మకాల కారణంగా, ప్రజలు ఆస్పత్రులకు పోకుండా మంత్రగాళ్లను, నాటువైద్యులను ఆశ్రయిస్తున్నారు.  
  •             గ్రామీణ ప్రాంతాల్లో యాంటీ వెనమ్​మందులు అందుబాటులో ఉండటం లేదు.
  •             కోల్డ్​స్టోరేజీ, రవాణాలో సమస్యల వల్ల యాంటీ వెనమ్​ మందుల ప్రభావం తగ్గిపోతోంది.
  •             యాంటీ వెనమ్​మందు ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

యాంటీ–వెనమ్​ ధరెంత?

యాంటీ–వెనమ్ ఉండే చిన్న వయల్‌ (చిన్న సీసా)​ ఒక్కోటి రూ. 250 నుంచి రూ. 500 వరకు ఉంటాయి. పాము విషం రకం, పరిస్థితిని బట్టి ఒక్కోసారి 10 వయల్స్​వరకూ ఇవ్వాల్సి ఉంటుంది.

పాము కరిస్తే ఏం చేయాలి?

  •             ఆందోళన చెందకుండా, ప్రశాంతంగా ఉండాలి.
  •             పాము కరిచిన భాగం వీలయినంత వరకూ కదల్చకుండా ఉంచాలి.
  •             నగటు, వాచీలు వంటివి ఉంటే తీసేయాలి. దుస్తులు టైట్​గా ఉంటే వదులు చేయాలి.
  •             వెంటనే ఆస్పత్రికి బయలుదేరాలి.

ఏం చేయకూడదు?

  •             పాము కరిచిన చోటు నుంచి రక్తం పీల్చడం, కోయడం, గాయాన్ని కాల్చడం వంటివి చేయరాదు.
  •             మంత్రగాళ్లు, నాటువైద్యుల వద్దకు వెళ్లకూడదు
  •             పాము కరిచిన చోట గాయానికి ఐస్, కెమికల్స్ తో రుద్దకూడదు.
  •             గాయానికి పైన గట్టిగా తాడుతో కట్టకూడదు. అలా చేస్తే వాపు మరింత ప్రమాదకరం అవుతుంది.