కిటకిటలాడిన నర్సన్న, రాజన్న ఆలయాలు

కిటకిటలాడిన నర్సన్న, రాజన్న ఆలయాలు
  • యాదగిరిగుట్టలో ధర్మ దర్శనానికి 3 గంటలు 
  • స్పెషల్ దర్శనానికి గంట సమయం

యాదగిరిగుట్ట/వేములవాడ, వెలుగు: వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు వేములవాడ రాజన్న ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీతో దర్శనం, ప్రసాదం క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణంలో సందడి కనిపించింది. స్వామి దర్శనానికి మూడు గంటలు, స్పెషల్  దర్శనానికి గంట సమయం పట్టింది.

ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.63,93,991 ఆదాయం వచ్చింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం ఆర్టీఐ కమిషనర్  పీవీ శ్రీనివాసరావు ఫ్యామిలీతో దర్శించుకున్నారు.

వేములవాడకు 60 వేల మంది..

వేములవాడ దర్శనానికి ఆదివారం 60 వేల మంది భక్తులు వచ్చారు. భక్తుల రద్దీతో స్వామి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. ప్రసాదం కౌంటర్, కోడెల టికెట్  కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. రాజన్నను అయోధ్యలోని లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్  అధ్యక్షుడు మహానాథ్  మహేంద్రదాస్‌ జీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్‌, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.