అవసరం లేని హంగులకు వేల కోట్ల ప్రజాధనం వృథా

అవసరం లేని హంగులకు వేల కోట్ల  ప్రజాధనం వృథా

కూటికి లేకున్నా కాటుక మాననట్లు రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌‌‌, అవసరం లేని హంగులకుపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. సీఎం అధికార నివాసమైన ‘ప్రగతి భవన్‌‌‌‌’ కట్టడానికి వందల కోట్లు, పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్లు, రైతు కన్నీరు తూడ్చలేని డమ్మీ కాళేశ్వరానికి వేల కోట్లు వృథాగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ఉద్యోగులకు కనీసం ఒకటో తారీఖున జీతాలియ్యలేని పరిస్థితికి తీసుకొచ్చారు.

‘ప్రగతి భవన్‌‌‌‌ నిర్మాణానికి ఎంత ఖర్చయింది? దాని నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేసిన్రు?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ జులైలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు రోడ్ల భవనాల శాఖ చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ లెటర్‌‌‌‌(30/EE/EBD/Supdt/RTI Act 2005/2022/579, Dt.22.07.22) ద్వారా సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం ప్రగతి భవన్‌‌‌‌ నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ అక్షరాల 45 కోట్ల 91 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

మార్చి 2016లో ప్రగతి భవన్‌‌‌‌ నిర్మాణ పనులు మొదలుపెడితే, నవంబర్‌‌‌‌ 2016లో పూర్తయ్యాయి. అంటే కేవలం 9 నెలల్లోనే పూర్తయిందనేది వారిచ్చిన సమాచార సారాంశం. ప్రగతిభవన్‌‌‌‌ నిర్మాణానికే రూ. 46 కోట్ల వరకు ఖర్చు చేస్తే, దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన ఫర్నిచర్‌‌‌‌, ఇంటిరీయర్​కు ఎంత ఖర్చు గావాలె? ఏసీలు ఇతర సౌకర్యాలకు ఎంత ఖర్చు చేసి ఉంటారు? ఆ లెక్కలు వెలికితీయాల్సి ఉంది.

పేదల ఆత్మగౌరవం ఎక్కడ?
1.69 లక్షలు చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రగతి భవన్‌‌‌‌ నిర్మాణానికి ఎంత ఖర్చు గావాలె? దానికి సంవత్సరానికి రూ.15 లక్షలకు పైగా ఆస్తి పన్ను పడుతున్నది. దాన్ని కూడా గడువులోపు కట్టకపోవడం వల్ల అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వడ్డీతో సహా 20 లక్షలు కట్టాలని జీహెచ్‌‌‌‌ఎంసీ రికార్డుల్లో పేర్కొనడం ‘మనదేం పోయింది ప్రజాధనమే కదా’ అనేలా వారి నిర్లక్ష్యానికి సాక్ష్యం. ఇట్లా అన్నీ కలుపుకుంటే, ఈ లెక్క వందల కోట్లల్లో ఉంటుంది. ‘నేను, నా భార్య, నాకు ఎవరున్నరు? మాకెందుకు పెద్ద పెద్ద భవనాలు?’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల ముందు మురిపించే ముచ్చట చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌ ఇయ్యాల లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రగతి భవన్‌‌‌‌ కట్టుకున్నరు.

‘ఆలుమగలు ఏడుండాలే? సుట్టం వస్తే ఏడ ఉండాలె? అందుకే చిట్టిబొట్టి ఇండ్లు కాదు, అందరికీ డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్త’నని చెప్పి ఎనిమిదేండ్లు దాటింది. 9 నెలల్లోనే ప్రగతి భవన్‌‌‌‌ కట్టించుకున్న సీఎం కేసీఆర్‌‌‌‌, తొమ్మిదేండ్లు కావొస్తున్నా తెలంగాణ పేద ప్రజలకు డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టిస్తలేరు? 2,91,057 గృహాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇప్పటివరకు 8 ఏండ్లలో 21 వేల ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణశాఖ పేదప్రజలకు డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇండ్లు ఇవ్వాలని అనేక పోరాటాలు చేసింది. పార్టీ సీనియర్‌‌‌‌ లీడర్​ఇంద్రసేనరెడ్డి దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌‌‌‌ యోజన కింద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నా ఆ నిధులను పక్కదారి పట్టిస్తూ పేదలకు నిలువ నీడలేకుండా చేసిన ఘనత టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వానిదే.

డెవలప్​ అయింది ఆయన కుటుంబమే..

9 నెలల్లోనే ప్రగతి భవన్‌‌‌‌ కట్టించుకున్న కేసీఆర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌ దగ్గర 125 అడుగుల అంబేద్కర్‌‌‌‌ విగ్రహ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేస్తలేరు? అమరవీరుల స్మారక స్థూపం, మ్యూజియం నిర్మాణాలకు ఇంకెన్నేండ్లు సమయం తీసుకుంటారు? ప్రగతిభవన్, కొత్త సెక్రటేరియట్​ను దగ్గరుండి వేగంగా కట్టించి, పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన నిర్మాణాలను మాత్రం గాలికొదిలేస్తారా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం, ఏడున్నర కోట్ల ప్రజల ఉమ్మడి రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సరిపోగా లేంది, తెలంగాణ ప్రజలను పరిపాలించడానికి సరిపోలేదా? అంతకు ముందు పదిమంది ఐఏఎస్‌‌‌‌ అధికారులు, ఇరవై నాలుగు మంది ఇతర అధికారులు నివాసం ఉండే క్వార్టర్స్‌‌‌‌ తొలగించి ఈ ప్రగతి భవన్‌‌‌‌ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?

ప్రగతి భవన్‌‌‌‌ దగ్గరలోనే మూసీ వరద పోటెత్తి, సస్తున్నం సారో అని ప్రజలు మొరపెట్టుకున్నా.. పట్టించుకున్న పాపానపోలేదు. ‘‘తెలంగాణ డెవలప్‌‌‌‌ గావాలె. డెవలప్‌‌‌‌ మెంట్‌‌‌‌ ఫలితాలు అందరికీ అందాలె. సామాజిక న్యాయమే నా కాన్సెప్ట్‌‌‌‌’’ అని ప్రొఫెసర్‌‌‌‌ జయశంకర్‌‌‌‌ సారు చెప్పిన మాటల్ని సీఎం కేసీఆర్‌‌‌‌ పాతరేశారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దివాళా తీయించిన, కేసీఆర్​ను, ఆయన కుటుంబాన్ని ప్రగతి భవన్‌‌‌‌ నుంచి బయటకు రప్పించేంత వరకు బీజేపీ పోరాటం ఆగదు. - డా. గంగిడి మనోహర్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రజాసంగ్రామ యాత్ర ప్రముఖ్‌‌‌‌