నిరసనల మధ్యే.. మూడు బిల్లులు ఆమోదం

నిరసనల మధ్యే.. మూడు బిల్లులు ఆమోదం

పార్లమెంటులో కొనసాగిన ఆందోళనలు 
సభకు ప్రధాని హాజరు కావాలని ప్రతిపక్ష సభ్యుల నినాదాలు 
మణిపూర్‌‌‌‌ హింసపై చర్చించాలంటూ డిమాండ్ 
న్యూఢిల్లీ:  
పార్లమెంటులో గురువారం కూడా అదే గందరగోళం కొనసాగింది. మణిపూర్‌‌‌‌ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. నిరసనల మధ్యే లోక్‌‌‌‌సభలో రెండు బిల్లులపై చర్చించి పాస్ చేయగా.. రాజ్యసభలో మరో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. అవిశ్వాస తీర్మానం పెండింగ్‌‌‌‌లో ఉండగా.. బిల్లులు పాస్ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. రూల్స్‌‌‌‌ ప్రకారం ఇలా చేయకూడదని తప్పుపట్టింది. 

లోక్‌‌‌‌సభ మూడు సార్లు
లోక్‌‌‌‌సభ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే.. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగించారు. తర్వాత కేంద్ర మంత్రి పియూష్ గోయల్, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభకు ప్రధాని హాజరు కావాలంటూ అపొజిషన్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ కాంగ్రెస్‌‌‌‌ సభ్యుడు స్పీకర్‌‌‌‌‌‌‌‌ వైపు పేపర్లు విసిరారు. దీంతో సభ 20 నిమిషాలు వాయిదా పడింది. 3 గంటలకు తిరిగి సమావేశమైంది. జన్ విశ్వాస్ బిల్లును టేకప్ చేసి, పాస్ చేశారు. తర్వాత సభ వాయిదా పడింది. 

రాజ్యసభ బీఏసీ బాయ్‌‌‌‌కాట్
రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌‌‌‌ను ప్రతిపక్ష కూటమి బాయ్‌‌‌‌కాట్‌‌‌‌ చేసింది. మణిపూర్‌‌‌‌‌‌‌‌ హింసపై పార్లమెంట్‌‌‌‌లో ప్రధాని ప్రకటన చేయనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ బీఏసీలో ఉప రాష్ట్రపతి సహా 11 మంది ఉండగా.. మీటింగ్‌‌‌‌కు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు ముగ్గురు, బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు వెళ్లలేదు.
 

ఇండియా.. మోదీ..
జైశంకర్ మాట్లాడుతున్నంత సేపు అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభ మారుమోగింది. తొలుత ‘మణిపూర్, మణిపూర్’ అంటూ ప్రతిపక్ష సభ్యులు స్లోగన్లు ఇచ్చారు. దీంతో ట్రెజరీ వైపు ఉన్న అధికార పార్టీ నేతలు ‘మోదీ.. మోదీ’ అంటూ నినదించారు. దీనికి కౌంటర్‌‌‌‌‌‌‌‌గా ప్రతిపక్ష కూటమి నేతలు ‘ఇండియా.. ఇండియా’ అని అరిచారు. ‘‘మీరు ‘ఇండియా’ అని చెప్పుకుంటారు.. కానీ భారతదేశ జాతీయ ప్రయోజనాలను వినడానికి సిద్ధంగా లేరు” అని జైశంకర్ మండిపడ్డారు.

ALSO READ :ఎడతెగని వానలు.. స్తంభించిన జనజీవనం

మూడు బిల్లులకు ఆమోదం
వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి తెచ్చిన జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2023తోపాటు 76 పాత చట్టాలను రద్దు చేసేందుకు తెచ్చిన బిల్లును లోక్ సభ గురువారం పాస్ చేసింది. ఇక రాజ్యసభలో  సినిమాటోగ్రఫీ (సవరణ) యాక్ట్ బిల్లు2023 కూడా నిరసనల మధ్యే పాస్ అయింది. 

భారతదేశం.. శాంతి, శ్రేయస్సుకు గొంతుక: జైశంకర్
 అసాధారణ, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారతదేశం ఇప్పుడు అందరి కోసం మాట్లాడే గొంతుగా మారిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం ఇండియా నిలబడుతుందన్నారు. ‘భారత విదేశాంగ విధానంలో తాజా పరిణామాలు’ అనే అంశంపై ఆయన సుమోటోగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పరపతి పెరుగుతున్నదని చెప్పారు. ‘‘భారత ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.  మన అభివృద్ధి భాగస్వామ్య పోర్ట్‌‌‌‌ఫోలియో ఇప్పుడు 78 దేశాలలో విస్తరించి ఉంది” అని వివరించారు.