
- పోటీపై ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే
- టికెట్ దక్కుతుందనే ఆశలో మరో ఇద్దరు నేతలు
- క్యాడర్‌ను ఆకట్టుకునేందుకు ఎవరికివారే ప్రయత్నాలు
కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న జుక్కల్నియోజకర్గం నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు ముగ్గురు నేతలు సై అంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఒకరు ఎన్ఆర్ఐ కాగా, మరొకరు మాజీ డీసీసీ.
తనకే టికెట్దక్కుతుందన్న ధీమాతో మాజీ ఎమ్మెలేకు పోటీగా మరో ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తుండడం ఇక్కడి పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ముగ్గురు నేతలు ఎవరికివారే నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సానుభూతి కలిసి వస్తుందని..
జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారం పెద్ద దిక్కుగా ఉన్నారు.ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈయన జుక్కల్ నుంచి మొత్తం ఏడుసార్లు పోటీచేసి 4 పర్యాయాలు విజయంగా సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే చేతిలో ఓడిపోయారు. సీనియర్ నేత కావడం, వరుసగా రెండుసార్లు ఓడిన సానుభూతి తనకు కలిసి వస్తుందనే ఉద్దేశంలో ఉన్నారు.
రంగంలోకి మరో ఇద్దరు నేతలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన గడుగు గంగాధర్ జుక్కల్ సీటుపై కన్నేశారు. కొద్ది నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇక్కడ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గానికి పక్కనే ఉండే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీకాంత్‌రావు కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
9 నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌ను, స్థానికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఇద్దరు నేతలు నియోజకవర్గానికి రావడం, వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా ఇటీవల యాక్టివ్అయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తన క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
జోడో యాత్ర, కర్నాటక గెలుపుతో జోష్
గతేడాది నవంబర్‌లో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మన స్టేట్ గుండా సాగింది. మన స్టేట్‌లో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ముగిసింది. ఇక్కడి నుంచి యాత్ర మహారాష్ట్రలోకి ఎంట్రీ అయ్యింది. స్టేట్‌లో యాత్ర ముగింపు సందర్భంగా జుక్కల్నియోజకవర్గంలోని మద్నూర్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభ సక్సెస్ కావడంతో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నియోజకవర్గానికి బార్డర్‌గా ఉన్న కర్నాటక లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పోటీకి ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు.