ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు 

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు 
  •        స్టేషన్​ బెయిల్​ కోసం రూ.25 వేలు అడిగిన ఆసిఫాబాద్​ఎస్​ఐ రాజ్యలక్ష్మి
  •        చార్జిమెమో ఎత్తేసేందుకు రూ.30 వేలు డిమాండ్​ చేసిన హుజూరాబాద్​ డీఎం శ్రీకాంత్​
  •        ఫార్మసీ సర్టిఫికెట్​ కోసం రూ.18 వేలు ఇవ్వాలన్న నల్గొండ డ్రగ్స్​ ఇన్​స్పెక్టర్​ సోమశేఖర్​​
  •        అందరినీ రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు

ఏసీబీ దూకుడు పెంచింది. ఒకే రోజు ముగ్గురు అవినీతి అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంది. యాక్సిడెంట్​ కేసులో ఓ నిందితుడికి స్టేషన్​ బెయిల్​ ఇచ్చేందుకు రూ. 25 వేలు డిమాండ్​ చేసిన ఆసిఫాబాద్​ పీఎస్​ ఎస్​ఐ రాజ్యలక్ష్మి, డ్యూటీకి రాని డ్రైవర్​కు చార్జిమెమో ఇచ్చి.. ఎత్తేసేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటున్న హుజూరాబాద్​ ఆర్టీసీ డీఎం శ్రీకాంత్​​, జనాలకు ఫ్రీగా వైద్యం అందించడంలో భాగంగా మెడికల్​ షాపు కావాలని అడిగితే..లైసెన్స్​ కోసం రూ.18 వేలు లంచం అడిగిన నల్గొండ డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ సోమశేఖర్​ ఇందులో ఉన్నారు. 

ఆసిఫాబాద్: రోడ్డు యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం, వాహనాన్ని వదిలిపెట్టేందుకు ఓ మహిళా ఎస్ఐ రూ. 25 వేల లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ పోలీస్  స్టేషన్ లో రాజ్యలక్ష్మి ఎస్ఐ. గత నెల 31న  ఆసిఫాబాద్ మండలం బురుగూడ వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ  కేసులో మంచిర్యాల జిల్లా నస్పూర్​కు చెందిన యాహియా ఖాన్ నిందితుడు. ఈయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, వాహనం రిలీజ్ చేసేందుకు ఎస్ఐ రాజ్యలక్ష్మి రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం పోలీస్​స్టేషన్​లో నిందితుడు రూ.  25 వేలను ఎస్​ఐ రాజ్యలక్ష్మికి ఇస్తుండగా అదిలాబాద్ రేంజ్ ఏసీబీ ఇన్ చార్జ్  డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి చెప్పారు.

లీవ్​ ఇవ్వకుండా చార్జిమెమో ఇచ్చి ఎత్తేసేందుకు 30 వేలు అడిగిన డీఎం..

ఎల్కతుర్తి: హుజూరాబాద్​ఆర్టీసీ డిపో మేనేజర్​శ్రీకాంత్​సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అదే డిపోలో పని చేస్తున్న ఓ డ్రైవర్ అనివార్య కారణాలతో​ డ్యూటీకి రాకపోవడంతో చార్జి మెమో ఇష్యూ చేశాడు. దానిని ఎత్తేసేందుకు రూ. 30 వేలు డిమాండ్​ చేశాడు. సోమవారం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన తాటికొండ రవీందర్​  హుజూరాబాద్​ఆర్టీసీ డిపోలో డ్రైవర్. ఫిబ్రవరి13న రవీందర్​సమీప బంధువు కొడుకు హనుమకొండలో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రవీందర్​ లీవ్ కోసం అప్లై చేశాడు.

కానీ, డీఎం లీవ్​ఇవ్వలేదు. దీంతో రవీందర్​డ్యూటీకి వెళ్లలేదు. డీఎం శ్రీకాంత్​మూడు రోజులు ఆబ్సెంట్​వేశాడు. రవీందర్​కు చార్జి మెమో ఇష్యూ చేశాడు. తర్వాత దానిని తొలగించాలని రవీందర్​కోరగా, రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. తనకు అంత ఆర్థిక స్తోమత లేదని, రూ. 10 వేలు మాత్రమే ఉన్నాయని రవీందర్​ ముట్టజెప్పాడు. అయినప్పటికీ డీఎం వినకపోవడం, మిగతా రూ. 20 వేలు ఇవ్వాలని పట్టుబట్టడంతో రవీందర్​ఏసీబీని ఆశ్రయించాడు. ఎల్కతుర్తిలోని మన్విత హోటల్​లో సోమవారం మధ్యాహ్నం రవీందర్ నుంచి డీఎం శ్రీకాంత్​ రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్​ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఇన్​స్పెక్టర్లు శ్యాంసుందర్​, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫార్మసీ లైసెన్స్​ కోసం.. 

నల్గొండ అర్బన్ : ఫార్మసీ లైసెన్స్​కోసం దరఖాస్తు చేసుకున్న ట్రస్టు నుంచి లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్​ఇన్​స్పెక్టర్​సోమశేఖర్​ ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు, బాధితుల కథనం ప్రకారం..మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తగూడెంలో నూకల వెంకట్​రెడ్డి..చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనుకున్నారు. ట్రస్టు దవాఖానకు అనుమతి తీసుకున్న తర్వాత మెడికల్ షాప్ కోసం అప్లై చేసుకున్నారు.

అయితే, డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ సోమశేఖర్​డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, ఉన్నతాధికారులు కూడా చెక్​ చేస్తారని ట్రస్టు నిర్వాహకుడి దగ్గర మేనేజర్​గా పని చేస్తున్న చిట్టెపు సైదిరెడ్డిని రూ. 18 వేలు లంచం డిమాండ్​ చేశారు. ఈ విషయాన్ని సైదిరెడ్డి..వెంకట్​రెడ్డికి చెప్పడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనలతో నల్గొండలోని ఆఫీసులో డ్రగ్​ఇన్​స్పెక్టర్​ సోమశేఖర్​కు రూ.18వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్​ రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. సోమశేఖర్​ను కస్టడిలోకి తీసుకుని రిమాండ్​కు తరలిస్తామన్నారు.   ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్​ నరేందర్​, సీఐలు వెంకట్​రావు, రామారావు పాల్గొన్నారు.