ముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్టు : ఖమ్మం సీపీ సునీల్ దత్

ముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్టు : ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు :  ఆన్​లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్​మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు రూ.1.62 కోట్లు మోసం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్రలోని విజయవాడలో సోమవారం అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. కేసు వివరాలను సైబర్​ క్రైమ్​ పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్ కు ఫోన్ చేసి ఆన్​లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్​మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని కొందరు వ్యక్తులు ఆశచూపారు. దాంతో అతడు వాట్సప్, ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు ఇన్వెస్ట్​మెంట్ చేసి మోసపోయాడు.

అనంతరం పోలీసులను ఆశ్రయించగా పంపిన కొంతడబ్బు షేక్ సుభాని అనే వ్యక్తి అకౌంట్​కు వెళ్లగా పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించారు. తను దాసరి సునీల్ కుమార్, సుదలగుంట్ల సాయిక్రిష్ణతో కలిసి నేరం చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. దీంతో ఆ ముగ్గురిని ఎన్టీఆర్​ జిల్లాలోని విజయవాడలో అరెస్ట్ చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించినట్లు సైబర్​క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్​ డీఎస్పీ సీహెచ్​ఆర్​వీ ఫణిందర్, ఇన్​స్పెక్టర్​ యాసీన్ అలీ, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీపీ అభినందించారు.