రిలాక్స్​ మోడ్..​పాలమూరులో ఏడు నెలల్లో మూడు ఎన్నికలు

రిలాక్స్​ మోడ్..​పాలమూరులో ఏడు నెలల్లో మూడు ఎన్నికలు
  •     పార్లమెంట్​ ఎన్నికలు ముగియడంతో బ్రేక్​ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, లీడర్లు
  •     త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్

మహబూబ్​నగర్, వెలుగు : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో నెలన్నర రోజులుగా బిజీబిజీగా గడిపిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆయా పార్టీల పార్లమెంట్​ క్యాండిడేట్లు రిలాక్స్​ మోడ్​లోకి వెళ్లిపోయారు. హైదరాబాద్​లో మంగళవారం సీఎం ఎనుముల రేవంత్​రెడ్డితో ఎన్నికల సమీక్ష అనంతరం అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు బ్రేక్​ తీసుకునేందుకు పర్యాటక ప్రాంతాలు, ఫారిన్​ ట్రిప్​లకు వెళ్లిపోయారు. మరికొందరు ఒకటి, రెండు రోజుల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రిజల్ట్స్​కు దాదాపు మూడు వారాల టైం ఉండటంతో, ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు.

ఏడు నెలలుగా ఫుల్​ బిజీ..

అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ లీడర్లు ఫుల్​ బిజీగా ఉంటున్నారు. అసెంబ్లీకి నవంబరు 30న పోలింగ్​ జరుగగా, నెల ముందు నుంచి వీరంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రిజల్ట్​ వెలువడిన వెంటనే కాంగ్రెస్​ అధికారంలోకి రాగా, ఎమ్మెల్యేలంతా ఆయా శాఖలతో సమీక్షలు, సమావేశాలతో గడిపారు. మహబూబ్​నగర్​ లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ బైపోల్​కు ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో షెడ్యూల్​రిలీజ్ చేయగా, ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానిక సంస్థల ఓటర్లను పోలింగ్​ స్టేషన్లకు తీసుకొచ్చి ఓట్లు వేయించడంలో కీ రోల్​ పోషించారు. 

ఈ ఎన్నికల రిజల్ట్స్​ అనౌన్స్​కు ముందు లోక్​సభ ఎన్నికలకు షెడ్యూల్​ ఖరారైంది. దీంతో ఈ ఎన్నికల రిజల్ట్స్​ వాయిదా వేయగా, పార్లమెంట్​ ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల లీడర్లు నియోజకవర్గాల్లోనే కొద్ది నెలలుగా తిష్ట వేశారు. షెడ్యూల్​ రిలీజ్​ అయినప్పటి నుంచే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, బీజేపీ, బీఆర్ఎస్​ లీడర్లు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఏప్రిల్​ మొదటి వారం నుంచి ప్రచారాన్ని స్పీడప్​ చేశారు. ఎండలు మండుతున్నా ప్రచారానికి గ్యాప్​ ఇవ్వకుండా పని చేశారు. 13న పోలింగ్​ పూర్తి కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

రిలాక్స్​ కావడానికి టూర్లకు వెళ్తున్నారు. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి విదేశాలలో సేద తీరుతున్నారు. మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి హైదరాబాద్​లో పెండింగ్​ పనులు చక్కబెట్టే పనిలో పడ్డారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి పోలింగ్​ అయిన తెల్లారే హైదరాబాద్​కు వెళ్లిపోయారు. 

కోయిల్​కొండలో జరిగిన కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారంలో ఈమె కాలికి గాయం అయ్యింది. గాయంతోనే ప్రచారాన్ని చివరి వరకు కంటిన్యూ చేశారు. ప్రస్తుతం రెండు రోజులుగా రెస్ట్​లో ఉన్నారు. దేవకరద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి కూడా హైదరాబాద్​లో ఉంటున్నారు. ఆయన కూడా పెండింగ్​ పనులను చక్కబెట్టుకుంటున్నారు. మక్తల్​ ఎమ్మెల్యే వాటికి శ్రీహరి, షాద్​నగర్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరు కూడా త్వరలో టూర్లు వెళ్లేందుకు ప్లాన్​ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లు చల్లా వంశీచంద్​రెడ్డి, డీకే అరుణ కూడా హైదరాబాద్​కు వెళ్లారు. 

పోలింగ్​ పర్సంటేజ్​పై కేడర్​తో చర్చలు..

సోమవారం పోలింగ్​ పూర్తి కాగా, మంగళవారం పోలింగ్​ సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. అయితే బూత్​ లెవల్​లో పోలింగ్​ సరళిపై ప్రధాన పార్టీల లీడర్లు కేడర్​తో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో పోలింగ్​ సరళిపై వారితో ఆరా తీశారు. ఎక్కడెక్కడ ఓట్లు పడ్డాయి? ఎక్కడ మైనస్​ అయ్యిందనే దానిపై వివరాలు సేకరించారు. యూత్, మహిళలు, రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారు ఎవరి వైపు మొగ్గు చూపించారనే దానిపై ఆరా తీశారు. ఫైట్​ టఫ్​గా నడవడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ క్యాండిడేట్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు..

పార్లమెంట్​ ఎన్నికలకు పోలింగ్​ ముగియగా, జూన్​ 4న ఓట్లు లెక్కించి రిజల్ట్స్​ను అనౌన్స్​ చేయనున్నారు. ఆ వెంటనే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు తరువాత ఈ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ప్రధాన పార్టీల ముఖ్య నేతలు పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బూత్​ స్థాయిలో పార్టీకి ఎక్కువ ఓట్లు ఎవరు వేయిస్తే వారికే లోకల్​ బాడీస్​ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, సర్పంచులుగా అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు. లోకల్​ బాడీస్​ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలొస్తాయనే ఆశతో కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేశారు.