కొత్త స్కాం: మూడు మిస్సుడు కాల్స్.. అకౌంట్ లోని డబ్బులు మాయం

కొత్త స్కాం: మూడు మిస్సుడు కాల్స్.. అకౌంట్ లోని డబ్బులు మాయం

ఢిల్లీకి చెందిన ఓ 35 ఏళ్ల న్యాయవాది మహిళకు మూడు మిస్స్ డ్ కాల్స్ వచ్చిన తర్వాత.. తన బ్యాంక్ ఖాతా నుంచి భారీ మొత్తాన్ని కోల్పోయింది. ఈ విచిత్రమైన ఈ 'సిమ్ స్వాప్ స్కామ్'లో, ఒక స్కామర్ అక్రమ మార్గాల ద్వారా మీ డూప్లికేట్ సిమ్ కార్డ్‌కి పొందుతాడు. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలతో పాటు మరిన్నింటిని యాక్సెస్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తాడు.

దేశవ్యాప్తంగా పలు రకాలుగా స్కామ్‌లు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసంతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ టెక్ యుగంలో టెలిగ్రామ్ జాబ్ స్కామ్, ఆర్మీ ఆఫీసర్ స్కామ్ లాంటి పలు మోసాల నుంచి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

సిమ్ స్వాప్ స్కామ్ ఎలా పనిచేస్తుందంటే..

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మహిళకు ఒక నంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె ఎలాంటి కాల్స్ ను రిసీవ్ చేసుకోలేదు. ఇది జరిగిన కొద్దిసేపటికే, తన బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు డెబిట్ అయినట్లు ఆమెకు టెక్స్ట్ మెసేజ్లు వచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆ మహిళ ఎవరికీ ఎటువంటి ఓటీపీ (OTP) గానీ, తన వ్యక్తిగత వివరాలను గానీ వెల్లడించలేదు. అయినప్పటికీ ఆమె డబ్బును కోల్పోయింది.

అక్టోబరు 18న జరిగిన ఈ ఘటనపై న్యాయవాది అయిన ఆమె అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆమె లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలియజేసింది. తనకు మొత్తం మూడు కాల్‌లు వచ్చాయని ఆమె ధృవీకరించింది. మరొక నంబర్‌ని ఉపయోగించి తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించగా.. అది కొరియర్ డెలివరీదని ఆమెకు సమాచారం అందింది.

"ఆమె తన ఇంటి చిరునామాను మాత్రమే  నిందితుడితో పంచుకుంది. ఆమె అతని నుంచి ఏదో ప్యాకేజీని అందుకుంటుందని భావించి, ఆమె దాన్ని స్వీకరించింది. ఆ తర్వాత, బ్యాంకింగ్ సర్వీసెస్ అప్లికేషన్ నుంచి వచ్చిన రెండు మెసెజ్ లు ఆమెను అప్రమత్తం చేశాయి” అని దర్యాప్తు అధికారి తెలిపారు. “న్యాయవాది ఎలాంటి బ్యాంకింగ్ వివరాలు, OTP లేదా పాస్‌వర్డ్‌ను పంచుకోలేదు. ఆమె మమ్మల్ని సంప్రదించినప్పుడు, ఆమె పర్మిషన్ లేకుండా చాలాసార్లు డబ్బు డెబిట్ చేయబడిందని మేం కనుగొన్నాం”అన్నారాయన.