పాముకాట్లతో ముగ్గురు మృతి

పాముకాట్లతో ముగ్గురు మృతి
  • నారాయణపేట జిల్లాలో రైతు.. 
  • కామారెడ్డి జిల్లాలో మహిళా రైతు 
  • మెదక్ ​జిల్లాలో ఉపాధి కూలి  

మరికల్ /పిట్లం/ కొల్చారం, వెలుగు : వేర్వేరు ప్రాంతాల్లో పాములు కాటు వేయడంతో ముగ్గురు కన్నుమూశారు. ఇందులో ఒకరు ఇద్దరు  రైతులు కాగా, మరొకరు ఉపాధి కూలీ ఉన్నారు. నారాయణపేట జిల్లా మరి కల్​ మండలం పస్పుల గ్రామానికి చెందిన రైతు ముష్టి శివయ్య(40) తన పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. చేనులో ఆదివారం గుంటుక కొడుతుండగా ఎడమ కాలిపై పాము కాటేసింది. కేకలు వేయగా దగ్గరలో ఉన్న తిరుమలయ్య అనే వ్యక్తి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 

మరికల్​ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించింది. దీంతో మహబూబ్​నగర్​ జిల్లా దవాఖానకు రెఫర్​ చేశారు. అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి తెలిపారు.  కామారెడ్డి జిల్లా పెద్దకొడప్​గల్​లో పత్తి చేనులో కలుపు తీస్తుండగా జోగు గంగవ్వ( 62) అనే మహిళను పాము కరిచింది. వెంటనే బాన్సువాడ ఏరియా హాస్పిటల్​ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

మెదక్ ​ జిల్లా కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ కు చెందిన కొత్త  కొమురయ్య (40) ఆదివారం ఉపాధి పనుల్లో భాగంగా  చెట్టు పక్కన పొదలు తీస్తుండగా అందులో ఉన్న పాము కాటేసింది. అక్కడే పడిపోవడంతో తోటి కూలీలు మెదక్ గవర్నమెంట్ దవాఖానకు తరలించిన కొద్ది సేపటికే  చనిపోయాడని ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్ తెలిపారు. మృతుడికి  భార్య , ఇద్దరు కొడుకులు ఉన్నారు.