భూ వివాదంలో ఒకరు.. కుటుంబ కలహాలతో ఇద్దరు.. జనగామ, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు

 భూ వివాదంలో ఒకరు.. కుటుంబ కలహాలతో ఇద్దరు.. జనగామ, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు
  • వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య జనగామ, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు

జనగామ, వెలుగు : భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్‌‌ మండలం కొండాపూర్‌‌లో సోమవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మోతె మల్లేశ్‌‌ తనకు వారసత్వంగా వచ్చిన 18 ఎకరాల భూమిని తన కుమారులు జితేందర్‌‌, జిన్నుల పేర్లపై 2016లో రిజిస్ట్రేషన్‌‌ చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న పాలోళ్లు పొత్తుల భూమిని ఎలా రిజిస్ట్రేషన్‌‌ చేసుకుంటావంటూ మల్లేశ్‌‌ను నిలదీయడంతో పాటు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. మల్లేశ్‌‌ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత కూడా మిగిలి ఉన్న మరో ఐదు ఎకరాల భూమి సైతం తమదేనంటూ జితేందర్, జిన్నులు ట్రాక్టర్‌‌తో చదును చేసే ప్రయత్నం చేయగా.. కొందరు అడ్డుకోవడంతో వారిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టారు.

 ఈ ఘటనను ముత్యాల సురేశ్‌‌ (30) అనే వ్యక్తి వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యాయత్నం కేసు నమోదైంది. కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో భయాందోళనకు గురైన జితేందర్‌‌, జిన్నులు మరో ముగ్గురు వ్యక్తులతో సాక్షులుగా ఉన్న ముత్యాల సురేశ్‌‌, మాచర్ల రమేశ్‌‌ను హత్య చేయాలని ప్లాన్‌‌ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి సురేశ్‌‌ను పట్టుకొని గ్రామశివారులోని మామిడి తోటలోకి తీసుకెళ్లి హత్య చేశారు. 

మాచర్ల రమేశ్‌‌ త్రుటిలో తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న సురేశ్‌‌ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషనఘన్‌‌పూర్‌‌ ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
తాగిన మైకంలో తల్లిని కొట్టి చంపిన యువకుడు

ఖమ్మం రూరల్, వెలుగు : తాగిన మైకంలో ఓ వ్యక్తి తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన మందుల బూబ (50) కొడుకు మధుకు పెండ్లి అయి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యతో మనస్పర్ధలు ఏర్పడడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మధు తల్లి వద్దే ఉంటున్నాడు. మద్యానికి అలవాటు పడిన మధు నిత్యం తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన మధు గొడ్డలితో తల్లిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సంజీవ్, ఎస్సై జగదీశ్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

భార్య కుటుంబ సభ్యుల దాడిలో అత్త మృతి, భర్తకు గాయాలు

ఖమ్మం రూరల్, వెలుగు : భార్య కుటుంబ సభ్యులు దాడి చేయడంతో అత్త చనిపోగా.. భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఖమ్మం రూరల్‌‌ మండలం ముత్తగూడెం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన గునిగంటి నాగమణి (50) కొడుకు మహేశ్‌‌కు అదే గ్రామానికి చెందిన అఖిలతో మూడేండ్ల కింద వివాహమైంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో అఖిల తల్లిగారింటి వద్దే ఉంటోంది. భార్య కాపురానికి రాకపోవడంతో మహేశ్‌‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. పలుమార్లు అఖిలకు నోటీసులు పంపించారు. అయినా ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. 

విడాకుల విషయం తెలుసుకున్న అఖిల తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భార్యాభర్తలను ఒక్కటి చేశారు. కొన్ని రోజులు భర్త దగ్గర ఉన్న అఖిల మళ్లీ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లింది. దీంతో అఖిల తండ్రి వెంకన్న, కుమారుడు మనోజ్, బంధువు యల్ది వెంకన్న కలిసి అఖిలకు నచ్చజెప్పి సోమవారం మహేశ్‌‌ ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. 

కొద్దిసేపటి తర్వాత వెంకన్న, మనోజ్‌‌, యల్ది వెంకన్న కలిసి కత్తులతో మహేశ్‌‌పై దాడి చేశారు. గమనించిన అతడి తల్లి నాగమణి అడ్డుకోవడంతో ఆమెను సైతం పొడవడంతో అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ మహేశ్‌‌ను ఖమ్మంలోని హాస్పిటల్‌‌కు తరలించారు. నిందితులు రూరల్‌‌ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్‌‌హెచ్‌‌వో ముష్క రాజు తెలిపారు.

వేర్వేరు కారణాలతో సోమవారం ముగ్గురిని హత్య చేశారు.  జనగామ జిల్లాలో భూ వివాదంలో ఓ యువకుడిని హత్య చేయగా, ఖమ్మం జిల్లాలో ఇద్దరిని చంపేశారు. తాగిన మైకంలో ఉన్న యువకుడు తల్లిని గొడ్డలితో కొట్టి చంపగా, భార్య కుటుంబ సభ్యులు దాడి చేయడంతో భర్తకు గాయాలు కాగా అడ్డొచ్చిన అతడి తల్లి చనిపోయింది.