
సీటు కోసం ముగ్గురు మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకున్నారు. నాదంటే నాది అంటూ జట్టుపట్టుకుని కొట్టుకున్నారు. నేను కూర్చుంటా అంటే నేనే కూర్చుంటా అని వాదులాడుకున్నారు. చెప్పులతో కొట్టుకుంటూ..దూషించుకున్నారు. ఈ ఘటన ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది.
జట్టుపట్టుకుని...
ముంబై లోకల్ ట్రైన్లో ముగ్గురు మహిళలు ఎక్కారు. ఈ సమయంలో సీటు కోసం వారి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ పెరిగి పెద్దదైంది. ఒక్కసారిగా వారిలో కోపం కట్టలు తెచ్చుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దుర్భాషలాడుకున్నారు. ఇతర ప్రయాణికులు ఈ వివాదంపై జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గొడవలొద్దు..అని ఎంత సర్ధిచెప్పినా..వినకపోగా..మరింత దాడి చేసుకున్నారు.
వీడియో వైరల్..
మహిళలు కొట్టుకున్న వీడియో క్లిప్... ఆరు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షరీఫైజాన్ సయ్యద్ అనే యూజర్ షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో ఏకంగా 3 లక్షల 76 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. అంతేకాదు 4వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబయి అనే ఓ ట్విట్టర్ యూజర్... సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి వైరల్ అయింది.