వీడియో చూస్తుండగా పేలిన సెల్ ఫోన్.. చిన్నారి మృతి

 వీడియో చూస్తుండగా పేలిన సెల్  ఫోన్.. చిన్నారి మృతి

సెల్ ఫోన్.. ఇంట్లో పిల్లలు మారం చేస్తున్నా.. అన్నం తినకపోయినా.. గొడవ చేస్తున్నా.. చేతిలో సెల్ ఫోన్ పెట్టి హాయిగా పని చేసుకంటున్నారు పేరంట్స్. మొబైల్ ఫోన్ లో ఇష్టమైన రైమ్స్ పెట్టి రిలాక్స్ అవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పబోయే వార్త చూస్తే మాత్రం.. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వాలంటేనే వణకుపుడుతుంది. కారణం.. మొబైల్ లో వీడియోలు చూస్తున్న సమయంలో ఆ ఫోన్ పేలిపోయింది.. చూస్తున్న చిన్నారి చనిపోయింది. దేశంలో ఇలాంటి ఘటన ఫస్ట్ టైం జరగటం ఇదే కావొచ్చు.. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పేరంట్స్ కు షాకింగ్ గా మారింది. 

ఇక వివరాల్లోకి వెళితే..అశోక్‌కుమార్‌, సౌమ్య దంపతుల కుమార్తె ఆదిత్యశ్రీ. ప్రస్తుతం ఆమె వయసు 8 సంవత్సరాలు. క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.  ఏప్రిల్ 24 సోమవారం  రాత్రి 10.30 గంటల ప్రాంతంలో  మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి  వీడియోలు చూస్తున్న టైమ్ లో ఒక్కసారిగా మొబైల్ పెలిపోయింది. పెద్ద శబ్థం రావడంతో ఆదిత్యశ్రీ తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కిందపడిపోయిన ఆదిత్యశ్రీని ఆసుపత్రికి తరలించారు.  అయితే అప్పటికే ఆదిత్యశ్రీ చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు.  చిన్నారి చేతిలో మొబైల్ ఫోన్ పేలటంతో.. చేతికి, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నచిన్న ఎలక్ట్రానిక్స్ రవ్వలు చిన్నారి ముఖానికి గుచ్చుకోవటంతోపాటు.. భారీ శబ్ధం రావటంతో చిన్నారి ఇంట్లోనే స్పృహ కోల్పోయింది.  ఆ వెంటనే కారులో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతోపాటు కరెంట్ షాక్ కూడా కొట్టిందని.. అందుకే చిన్నారి చనిపోయిందని చెబుతున్నారు డాక్టర్లు.

వీడియోలు చూస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ లో ఉందని.. చాలా సమయం అలాగే ఆడుతుండటంతో.. బ్యాటరీ హీటెక్కి పేలి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టెక్ నిపుణులు. సహజంగా మొబైల్ ఫోన్లు పేలవని.. చాలా చాలా రేర్ కేసుల్లోనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. కరెంట్ సప్లయ్ లో తేడా ఉన్నా.. హై ఓల్టేజ్ వచ్చినా కొన్ని సార్లు ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోతుంటాయని.. అలాంటిదే ఈ ఘటన అయ్యి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హార్డ్ వేర్ నిపుణులు.

ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. ఎనిమిదేళ్ల చిన్నారి ఆదిత్యశ్రీ మాత్రం తిరిగిరాదు.. సరదాగా మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తూ తిరిగిరాని లోకానికి వెళ్లటం.. దేశంలోని తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. ఇకనైనా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఉంది..