ఐసీసీని వదలని సైబర్ నేరగాళ్లు ..రూ. 20 కోట్లు స్వాహా

ఐసీసీని వదలని సైబర్ నేరగాళ్లు ..రూ. 20 కోట్లు స్వాహా

ఐసీసీకి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఐసీసీని మోసం చేసి ఏకంగా రూ.20 కోట్లపైగా కొట్టేశారు.  అమెరికాకు చెందిన కొందరు దుండగులు ఐసీసీని మోసం చేసినట్లు తెలుస్తోంది.  ఐసీసీకి చెందిన కన్సల్టెంట్‌ అంటూ ఈ సంస్థ నుంచి సొమ్మును కాజేసినట్లు సమాచారం. 

ఐసీసీ కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఓ ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు సైబర్ నేరగాళ్లు మెయిల్ చేశారు. ఈ  మెయిల్‌లో 5 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన వోచర్‌ను క్లియర్ చేయాలని పేర్కొన్నారు.  ఏ అకౌంట్కు నగదును బదిలీ చేయాలో కూడా వెల్లడించారు. దీంతో నిజమే అనుకుని..ఐసీసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ వోచర్‌ను క్లియర్ చేసింది. ఆ తర్వాత ఇదే విధంగా మరో  రెండు, మూడు సార్లు మెయిల్ చేసి..ఐసీసీ సొమ్ము నొక్కేశారు.  మొత్తంగా 2.5 మిలియర్ అమెరికన్ డాలర్లు  కొట్టేశారని తెలుస్తోంది. ఈ స్కామ్పై అమెరికా ప్రభుత్వానికి ఐసీసీ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. 

ఇలాంటి  మోసాలను బీఈసీ అంటారు. అంటే  బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ ఫిషింగ్ అని అర్థం. సేమ్  మెయిల్‌ ఐడీతోనే సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే దాన్ని బీఈసీ మోసం అంటారు.  ఐసీసీ వంటి పెద్ద అంతర్జాతీయ సంస్థే ఇలా మోసపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.