వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆత్మకూరు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. ఆత్మకూరులో పీజేపీ క్యాంప్ దగ్గర 50 పడకల ఆసుపత్రి, కృష్ణా నదిపై బ్రిడ్జి, ఇండోర్ స్టేడియం, వివిధ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో హెలిప్యాడ్, పార్కింగ్, బారికేడింగ్ ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ పరిశీలించారు. సీఎం పర్యటన సజావుగా జరిగేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
వీఐపీ, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. డీఎఫ్‌వో అరవింద్, ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, వనపర్తి, ఆత్మకూరు, కొత్తకోట సీఐలు కృష్ణయ్య, శివకుమార్, రాంబాబు, ఆర్ఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్బీ సీఐ నరేశ్, ఎస్సై జయన్న పాల్గొన్నారు.
మక్తల్: సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్ పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు నారాయణపేట ఎస్పీ వినీత్ తెలిపారు. మక్తల్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాయ్స్ హాస్టల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులతో సమావేశమై పలు సూచనలు చేశారు. బందోబస్తులో ముగ్గురు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 31 మంది సీఐలు, 85 మంది ఎస్సైలు, 145 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోమ్ గార్డులు పాల్గొంటారని తెలిపారు.
వీరితో పాటు నాలుగు టీఎస్ఎస్పీ ప్లాటూన్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 12 సెక్టార్లుగా విభజించి, సెక్టార్‌కు అదనపు ఎస్పీలు, డీఎస్పీలను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీలు ఎండీ రియాజ్, రాజారత్నం, డీఎస్పీ ఎన్.లింగయ్య, మహేశ్ పాల్గొన్నారు.
