
- ఫీల్డ్ లెవెల్లో పర్యటించిన ఉన్నతాధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 6న జరిగే గణేశ్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిడ్, కలెక్టర్ హరిచందన దాసరి కలిసి బాలాపూర్ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్‌ను ఫీల్డ్లెవెల్లో పరిశీలించారు.
శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలాపూర్, చార్మినార్ సర్కిల్, మోజమ్జాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగా కమిషనర్ పలు సూచనలు చేశారు. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
విగ్రహాల ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాలపై అధికారులతో మార్గమధ్యలో చర్చించారు. గణేశ్నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా 30 వేల మంది పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. అంతకుముందు అధికారులు బాలాపూర్ గణేశ్‌ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అందరూ సహకరించాలి
బషీరాబాగ్: సామూహిక గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలని జంట నగరాల సీపీలు కోరారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీసీలు సీవీ ఆనంద్, సుధీర్ బాబు, అవినాష్‌మహంతి హాజరయ్యారు. ఈసారి ఎత్తైన విగ్రహాల వల్ల ఇబ్బందులు రాకుండా చూస్తామని, త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా సహకరించాలని కోరారు.