పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. యూకేలో మళ్లీ లాక్‌‌డౌన్

పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. యూకేలో మళ్లీ లాక్‌‌డౌన్

లండన్: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉధృతి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీల్లో నెల రోజులపాటు లాక్‌‌డౌన్ విధించారు. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్‌‌లో కూడా లాక్‌‌డౌన్ వేశారు. నాలుగు వారాలపాటు ఇంగ్లండ్ వ్యాప్తంగా కరోనా లాక్‌‌డౌన్ విధిస్తున్నామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ శనివారం ప్రకటించారు. గురువారం నుంచి మొదలయ్యే లాక్‌‌డౌన్ ఆంక్షలు డిసెంబర్ 2 వరకు అమల్లో ఉండనున్నాయి. యూకేలో కరోనా కేసుల సంఖ్య 1 మిలియన్‌ను దాటింది. గతంలో మాదిరిగా కాకుండా ఈ లాక్‌‌డౌన్‌‌లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను తెరిచి ఉంచనున్నారు. ప్రకృతితో మనం గౌరవంగా మెలగాలని బోరిస్ జాన్సన్ చెప్పారు. యూరప్‌‌లో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా పెరుగుతోందన్నారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా వైరస్ మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉందని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. లాక్‌‌డౌన్ విధించడంతోపాటు పలు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ సమయంలో దీన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదన్నారు. ‘ప్రజలు తమ ఇళ్ల వద్దే ఉండాలి. చదువుకోవడానికి మాత్రమే బయటకు రావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే ఆఫీసులకు వెళ్లొచ్చు. మీ పొరుగున ఉన్న వారిని కూడా కలవొద్దు. ఇది కూడా ప్రమాదకరమే. తొలి లాక్‌‌డౌన్ కంటే ఈ లాక్‌‌డౌన్‌‌లో నిబంధనలు పరిమిత స్థాయిలో అమలవుతాయి. నాన్ ఎస్సెన్షియల్ షాప్స్, రెస్టారెంట్లు, బార్లు, పబ్స్, హాస్పిటాలిటీ వెన్యూస్ మూసేసి ఉంటాయి. రెస్టారెంట్లలో టేక్ అవే ఆప్షన్‌‌ను మాత్రమే అనుమతిస్తాం’ అని బోరిస్ పేర్కొన్నారు.