ఎల్‌‌ఎండీ గేట్లు ఓపెన్‌‌.. మోయతుమ్మెద వాగుకు భారీ వరద

ఎల్‌‌ఎండీ గేట్లు ఓపెన్‌‌.. మోయతుమ్మెద వాగుకు భారీ వరద

తిమ్మాపూర్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలకు మిడ్‌‌ మానేరుతో పాటు మోయతుమ్మెద వాగుకు భారీ వరద రావడంతో ఎల్‌‌ఎండీ రిజర్వాయర్‌‌ నిండుకుండలా మారింది. ప్రస్తుతం మిడ్‌‌ మానేరు నుంచి 6 వేల క్యూసెక్కులు, వాగు నుంచి 242 క్యూసెక్కులు, ఎగువ కాకతీయ నుంచి 1400 క్యూసెక్కుల నీరు ఎల్‌‌ఎండీకి వస్తోంది. 

రిజర్వాయర్‌‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23.516 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మంగళవారం ప్రాజెక్ట్‌‌ రెండు గేట్లను ఫీట్‌‌ మేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మానకొండూర్‌‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌‌ పమేలా సత్పతి కలిసి స్విచ్‌‌ ఆన్‌‌ చేసి గేట్లను ఓపెన్‌‌ చేశారు. 

దిగువ కాకతీయ కాల్వకు ఐదు వేల క్యూసెక్కులు, మిషన్‌‌ భగీరథ కోసం 302 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్‌‌ సీపీ గౌస్‌‌ ఆలం, సుడా చైర్మన్‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి, ఎస్‌‌ఈ పెద్ది రమేశ్, ఈఈ సదయ్య, ఏఈ వంశీకృష్ణ, నాయకులు రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, బండారి రమేశ్​, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు.