భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పరిధిలో..కారును ఢీకొన్న టిప్పర్‌‌.. తల్లీకొడుకు మృతి

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పరిధిలో..కారును ఢీకొన్న టిప్పర్‌‌.. తల్లీకొడుకు మృతి
  • మరో నలుగురికి తీవ్ర గాయాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కారు, టిప్పర్‌‌ ఢీకొట్టడంతో తల్లీ కొడుకు చనిపోగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూటౌన్‌‌ పోలీస్‌‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని అంబేద్కర్‌‌ కోనసీమ జిల్లా చిరుతపూడి గ్రామానికి చెందిన మామిడిశెట్టి వెంకటపతి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ నెల 19న కాళేశ్వరానికి వచ్చారు. అక్కడ పుష్కరస్నానం చేసిన అనంతరం భద్రాచలం చేరుకొని సీతారామున్ని  దర్శించుకున్నారు. అనంతరం వెంకటపతి అల్లుడి ఊరైన తిరువూరికి బయలుదేరారు.

అర్ధరాత్రి టైంలో కొత్తగూడెంలోని టూటౌన్‌‌ పీఎస్‌‌ పరిధిలోని పెనగడప సమీపంలోకి రాగానే సత్తుపల్లి కిష్టారం నుంచి కొత్తగూడెంలోని ఆర్‌‌సీహెచ్‌‌పీకి వెళ్తున్న బొగ్గు టిప్పర్‌‌ కారును ఢీకొట్టింది. దీంతో వెంకటపతితో పాటు అతడి భార్య కనకదుర్గ (54), కొడుకు వెంకటరత్నం (36), కోడలు స్వరూపారాణి, మనవరాలు చేతన్‌‌ చెర్రీస్‌‌, బంధువు దీక్షిత్‌‌ గాయపడ్డారు. ఇదే టైంలో అటుగా వచ్చిన బొగ్గు లారీల డ్రైవర్లు, పోలీసులు గాయపడిన వారిని బయటకు తీశారు. వారిని అంబులెన్స్‌‌లో కొత్తగూడెంలోని గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు ఈ క్రమంలోనే కనకదుర్గ చనిపోయింది. వెంకటరత్నం పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.