ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ

ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ
  • పశ్చిమ బెంగాల్​లో బీజేపీ అభ్యర్థి తీరు వివాదాస్పదం 
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
  • అధికార టీఎంసీ నేతల విమర్శలు

కోల్ కతా: పశ్చిమ బెంగాల్​లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తూ ఓ యువతికి ముద్దు పెట్టారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము మాల్దా నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని శ్రిహిపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆ టైమ్​లో ఓ యువతికి ఆయన ముద్దు పెట్టారు. 

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖగెన్ తీరుపై టీఎంసీ నేతలు మండిపడ్డారు. ‘‘మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి బెంగాలీ మహిళలపై అసభ్యకరమైన పాటలు పాడే నేతల వరకు బీజేపీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవ లేదు. ఇప్పుడు మరో ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఓ యువతిని ముద్దు పెట్టుకున్నారు. ఓవైపు నారీశక్తి సమ్మాన్’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుంటే.. మరోవైపు ఆ పార్టీ ఎంపీలే మహిళలను వేధిస్తున్నారు. ఇక వాళ్లు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో టీఎంసీ పోస్టు పెట్టింది. 

కాగా, తాను చేసిందాంట్లో తప్పేముందని బీజేపీ నేతల ఖగేన్ ముర్ము ప్రశ్నించారు. ‘‘ఆ యువతిని నా బిడ్డగా భావించి ముద్దు పెట్టాను. అందులో తప్పేముంది. నాపై కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు. మరోవైపు ఖగెన్ ముర్ముకు ఆ యువతి కూడా మద్దతుగా నిలిచారు. ‘‘నన్నొక బిడ్డగా భావించి ఖగెన్ ముర్ము నాకు ముద్దు పెట్టారు. అందులో అసభ్యత ఏముంది? అప్పుడు అక్కడ మా అమ్మానాన్న కూడా ఉన్నారు. డర్టీ మైండ్ ఉన్నోళ్లే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో 
వైరల్ చేస్తున్నారు అని ఆ యువతి మండిపడ్డారు.