
పాలమూరు వెలుగు: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేయక ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో 90 శాతం నెరవేర్చలేదన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పేస్కేల్ చెల్లించాలని, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు శాశ్వత పద్ధతిన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మె అనివార్యమైతే రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శంకర్, కోశాధికారి రాజలింగం, రాష్ట్ర కార్యదర్శులు యాదయ్య. నిరంజన్, సత్యనారాయణ, బీఎస్.రెడ్డి, ఎండీ.వహీద్, నాగయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీసీఎస్.రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్ రెడ్డి, డీఎస్.చారి తదితరులు పాల్గొన్నారు.