- గర్భిణికి వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా పుట్టిన శిశువు
- పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి
- హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే అంటూ బాధిత కుటుంబం ఆరోపణ
మేళ్లచెరువు(హుజూర్ నగర్), వెలుగు : గర్భిణికి నొప్పులు రావడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది అతికష్టం మీద డెలివరీ చేశారు. పుట్టిన బిడ్డ చికిత్స పొందుతూ కొద్ది గంటల తర్వాత చనిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన జిల్లా నాగరాజు భార్య రేణుక గర్భిణి. ఆమెకు ఈనెల19న డెలివరీ డేట్ ఇచ్చారు.
అయితే.. గత ఆదివారం ఉదయం గర్భిణికి పురిటి నొప్పులు రాగా హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం నొప్పులతో రేణుక తీవ్ర ఇబ్బంది పడుతుండగా.. డ్యూటీ డాక్టర్ రాకపోవడంతో నర్సులు ఫోన్ చేసి విషయం చెప్పారు. డాక్టర్ వచ్చి నార్మల్ డెలివరీకి చాన్స్ లేదని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని గర్భిణి భర్త నాగరాజుకు సూచించి వెళ్లిపోయారు. అప్పటికే తెల్లవారుజామున 3 గంటలు అవుతుండటం, రేణుక పురిటి నొప్పులు భరించలేకపోతుండగా.. కుటుంబసభ్యులు బతిమిలాడడంతో నర్సులు నార్మల్ డెలివరీకి యత్నిస్తుండగా తట్టుకోలేక కేకలు వేసింది. అయినా.. బలవంతంగా గర్భిణి పొట్టను ఒత్తిపట్టి శిశువును బయటకు తీశారు.
పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు డాక్టర్ రెఫర్ చేయగా.. సోమవారం ఉదయం తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్ చేసిన12 గంటలు అబ్జర్వేషన్ తర్వాత శిశువు మృతి చెందాడు. దీంతో హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది పట్టించుకోకుండా.. నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతోనే తమ శిశువు చనిపోయాడని రేణుక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనెల17న హుజూర్ నగర్ పోలీసుస్టేషన్ లో బాధితురాలి భర్త నాగరాజు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. మెడికల్ రిపోర్టులు తీసుకొస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని అతనికి సూచించినట్టు పోలీసులు తెలిపారు.
డాక్టరే కాన్పు చేసింది
గర్భిణి రేణుక హాస్పిటల్ కు వచ్చాక నొప్పులు రాలేదు. ఇంటివద్ద మొదలయ్యాకే వచ్చింది. డ్యూటీ డాక్టర్ సింధూ కాన్పు చేసింది. పుట్టిన శిశువు బలహీనంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు రెఫర్ చేశామని హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ప్రవీణ్ కుమార్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్