
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్. "కోవిడ్ నిబంధనలకు లోబడి మా పార్టీ కార్యాయలంలో ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏమిటి?. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ‘నిరుద్యోగ దీక్ష’తో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ కళ్లకు కన్పడటం లేదా?. ఉద్యోగ, ఉపాధి కరువై లక్షలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన బీజేపీ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’కు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరుతున్నా." అన్నారు బండి సంజయ్.