మధ్య వయసులోనే ఇలా కీళ్లు అరిగిపోవడానికి  కారణాలేంటి?

మధ్య వయసులోనే ఇలా కీళ్లు అరిగిపోవడానికి  కారణాలేంటి?

శరీరాన్ని మోసేవి కాళ్లు అయితే ఆ కాళ్లను నిలబెట్టేవి కీళ్లు.  కీలు కదిలితేనే శరీరం కదులుతుంది.  శరీర బరువునంతా తమ మీద వేసుకుని మోసే ఈ కీళ్లు  చిన్న వయసులోనే పుటుక్కు మంటున్నాయి. వయసు ముప్ఫై దాటుతున్న ఆడవాళ్లలో కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తు న్నాయి. ‘మధ్య వయసులోనే ఇలా కీళ్లు అరిగిపోవడానికి  కారణాలేంటి?   వీటి నుంచి ఎలా బయటపడాలి?’ అని డా. హరి ప్రకాష్‌‌ను అడిగితే ఇలా చెప్పారు.  

కీళ్ల నొప్పులు మొదలైతే ఒక పట్టాన తగ్గవు. కూర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి, నడిస్తే నొప్పి. ఈ నొప్పుల వల్ల ఏ పనీ చేసుకోలేకపోతారు చాలామంది. ఈ కీళ్ల నొప్పులను అర్థం చేసుకోవాలంటే మోకాలి నిర్మాణం గురించి తెలుసుకోవాలి. మోకాలి దగ్గర పైన తొడ ఎముక , కింద కాలి ఎముక, మధ్యలో మృదులాస్థి (కార్టిలేజ్‌‌), సయనోవియల్ ఫ్లూయిడ్  ఉంటాయి. ఇవి మోకాలు కదిలించినప్పుడు ఎముకలు రాసుకోకుండా, సున్నితంగా కదిలేలా చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ క్రమంగా మృదులాస్థిలో నీటిశాతం తగ్గిపోయి, కీలు అరగడం మొదలవుతుంది. సాధారణంగా కీలు అరిగేదశకు చేరుకోడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మారుతున్న లైఫ్‌‌స్టైల్ హ్యాబిట్స్ కారణంగా మహిళల్లో చిన్న వయసు నుంచే కీళ్ల సమస్యలు మొదలవుతున్నాయి.

ఎందుకొస్తాయంటే..
కీళ్ల నొప్పులు రావడానికి చాలా కారణాలుంటాయి. దెబ్బ తగలడం, మోకాలి చిప్పలు అరిగిపోవడం లేదా పోషకాహార లోపం లాంటివి ముఖ్య కారణాలని చెప్పొచ్చు. వర్షాకాలంలో శరీరానికి  ఎండ తగలదు. కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లకి ఈ సీజన్‌‌లో నొప్పులు ఎక్కువవుతుంటాయి. అలాగే బరువు పెరగడం కూడా కీళ్ల నొప్పులకు కారణమే. నడిచేటప్పుడు శరీర బరువంతా మోకాళ్ల మీదే పడుతుంది. బరువు పెరిగిన కొద్దీ కీళ్ల మీద భారం కూడా పెరుగుతూ వస్తుంది. అందుకే ఒబెసిటీ ఉన్నవాళ్ల కీళ్లు ముందుగానే అరిగిపోయే ప్రమాదముంది. పరిగెత్తడం, గెంతడం వంటివి చేయడం వల్ల కూడా కీళ్ల మీద భారం పెరుగుతుంది. ముఖ్యంగా  మెట్లు ఎక్కేటప్పుడు మోకాలి కీళ్ల మీద నాలుగు రెట్లు ఎక్కువగా బరువు పడుతుంది. ఇక వీటితో పాటు క్యాల్షియం లోపిస్తే ఎముకలతో పాటు కండరాలూ పట్టుతప్పుతాయి.  చిన్న వయసులో కీళ్ల నొప్పులు మొదలవ్వడానికి మరో కారణం గంటలకొద్దీ కూర్చొని పని చేయడం.  ఒకే తరహా పనులను పదేపదే చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. క్రమంగా మోకాలి చిప్ప అరిగే దశకు చేరుకుంటుంది.

ఏం చేయాలి?
కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ముందుగా ఏయే పనులు చేస్తున్నప్పుడు నొప్పి వస్తుందో గుర్తించి, వాటిని చేయకుండా జాగ్రత్త పడాలి. కీళ్ల మీద  పడే ఒత్తిడిని తగ్గిస్తే చాలావరకు నొప్పి తగ్గిపోతుంది.  నొప్పిగా ఉన్నప్పుడు వీలైనంత వరకూ రెస్ట్ తీసుకోవాలి. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేయకూడదు. శరీరానికి విటమిన్ డి అందేలా చూసు కోవాలి. నీళ్లు బాగా తాగాలి.   షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌‌ను తగ్గించాలి. రెస్ట్ తీసుకు న్నప్పటికీ నొప్పులు బాధిస్తుంటే వెంటనే డాక్టర్‌‌‌‌ను సంప్రదించాలి.

రాకుండా ఉండాలంటే..
కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.  తొడ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం ద్వారా కీళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు కనీసం వాకింగ్, జాగింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలైనా చేస్తుండాలి. మోకాలికి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌‌ను తగ్గించి, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలి.చేపలు, నట్స్, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.  ఇక వీటితో పాటు బరువు పెరగకుండా జాగ్రత్తపడడం కూడా అవసరం. బరువు ఎక్కువ ఉండటం వల్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది ఫ్యూచర్‌‌‌‌లో కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.

చికిత్స ఇలా..
తేలికపాటి కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాధారణ మందులు, చికిత్స సరిపోతాయి. కండరాలు బలోపేతం అవ్వడానికి ఒక్కోసారి  క్యాల్షియం, విటమిన్‌‌ డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. నొప్పి నుంచి ఇన్‌‌స్టంట్ రిలీఫ్ కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ లాంటివి కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ కీళ్ల అరుగుదల నాలుగో దశలో ఉంటే.. మందులు, వ్యాయామాలతో ఫలితం కనిపించకపోతే  కీళ్ల మార్పిడి చేయాల్సి ఉంటుంది.

వర్షాకాలం ఎక్కువ
వర్షాకాలంలో వాతావరణంలోని పీడనం, తేమ పెరిగినప్పుడు ఆ ప్రభావం కీళ్లపై  పడుతుంది. తక్కువ టెంపరేచర్​ ఉన్నప్పుడు  కీళ్లలో సయనోవియల్ ద్రావణం చిక్కబడుతుంది. కీళ్లు సున్నితంగా కదిలేందుకు సాయపడే ఈ ద్రావణం  చిక్కబడితే..  కీళ్లలో బిగుతుగా పట్టేసినట్టు అనిపిస్తుంటుంది. అలాగే తక్కువ పీడనం ఉన్నప్పుడు కీళ్ల కండరాలు కూడా బిగుసుకుంటాయి. అందుకే వర్షాకాలం, చలికాలాల్లో కీళ్ల నొప్పులు ఎక్కువవుతుంటాయి.

డా. డి. హరి ప్రకాష్
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్  & జాయింట్ రీప్లేస్‌‌మెంట్ సర్జన్, రెనోవా 
హాస్పిటల్స్, హైదరాబాద్